వ్యాక్సిన్ తయారీలో సేఫ్టీకే ప్రాధాన్యమిచ్చాం: భారత్ బయోటెక్
ఆస్ట్రాజెనికా టీకాపై బ్రిటన్‌లో వివాదం నేపథ్యంలో ప్రకటన
హైదరాబాద్, వెలుగు: కరోనా నివారణ కోసం తాము తయారు చేసిన కొవాగ్జిన్ టీకాతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ ప్రకటించింది. సేఫ్టీ ఫస్ట్ అన్న అంశానికే తాము అత్యధిక ప్రయారిటీ ఇచ్చి వ్యాక్సిన్‌ను తయారు చేశామని తెలిపింది.
బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనికా కంపెనీ, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ కలిసి తయారు చేసిన కరోనా టీకా ‘కొవిషీల్డ్’తో అరుదుగా రక్తం గడ్డలు కట్టే సమస్య రావచ్చని ఆ కంపెనీ కోర్టులో అంగీకరించిన నేపథ్యంలో భారత్ బయోటెక్ తమ టీకాపై వివరణతో గురువారం ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. భారత్‌లో ప్రభుత్వం చేపట్టిన కొవిడ్ 19 వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఎఫికసీ ట్రయల్స్ నిర్వహించిన ఏకైక టీకా తమదేనని స్పష్టం చేసింది.
‘‘లైసెన్స్ ప్రక్రియలో భాగంగా కొవాగ్జిన్‌ను 27 వేల మంది వాలంటీర్లపై పరీక్షించాం. క్లినికల్ ట్రయల్ మోడ్‌లో పరిమితి వినియోగం కోసం మా టీకాకు లైసెన్స్ పొందాం. ఆ తర్వాత డీటైల్డ్‌గా లక్షలాది మంది నుంచి సేఫ్టీకి సంబంధించిన డేటా సేకరించాం. కొవాగ్జిన్ టీకా పూర్తి సురక్షితమని కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ధ్రువీకరించింది. కొవాగ్జిన్ టీకా లైఫ్ సైకిల్ ముగిసేవరకు కూడా సేఫ్టీ మానిటరింగ్ కొనసాగించాం.
అన్నింటిలోనూ మా టీకా అద్భుతంగా పని చేసింది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ నమోదు కాలేదు” అని భారత్ బయోటెక్ తన ప్రకటనలో వివరించింది. కొవాగ్జిన్తో పాటు అన్ని వ్యాక్సిన్ లనూ తాము సేఫ్టీకి ప్రాధాన్యం ఇస్తూ తయారు చేస్తున్నామని పేర్కొంది.