
న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్‌లో ఈ నెల 22, 23 తేదీల్లో సీఎస్ఐఆర్ స్టార్టప్ కాన్ క్లేవ్‌ను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పరిశోధన సంస్థలు, స్టార్టప్‌ల మధ్య సహకారాన్ని సులభతరం చేయడం, భారత్‌లో ఆంత్రప్రెన్యూర్ షిప్‌ను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహించనున్నది. కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అధ్యక్షతన ఆదివారం జరిగిన ఐఐసీటీ, ఎన్టీఆర్ఐ, సీసీఎంబీ డైరెక్టర్లతో సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశంలో ఐఐసీటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఎన్టీఆర్ఐ డైరెక్టర్ ప్రకాశ్ కుమార్, సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ నందికూరి, ఇతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సీఎస్ఐఆర్- ఐఐసీటీ, సీఎస్ఐఆర్-ఎన్టీఆర్, సీఎస్ఐర్ -సీసీఎంబీ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించనున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ఔషధ ఆవిష్కరణ, జన్యు నిర్ధారణలో హైదరాబాద్‌కు చెందిన సీఎస్ఆర్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని గుర్తుచేశారు. హైదరాబాద్ శాస్త్రీయ పరిశోధనలు, ఆవిష్కరణలు, ఆంత్రప్రెన్యూర్ షిప్‌లకు హబ్‌గా నిలుస్తున్నదని ఆయన పేర్కొన్నారు.