హైదరాబాద్: ఎన్నికల వేళ ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మూడు పార్టీలు పోటీలు పడి ఫిర్యాదులు చేసుకున్నాయి. ఇవాళ ఉదయం ఓటేసేందుకు వచ్చిన కిషన్ రెడ్డి మోదీ పేరును ప్రస్తావించారంటూ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. కొడంగల్ లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొంటూ బీజేపీ నాయకుడు, మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కంప్లయింట్ చేశారు.
అజాంపురా లోని ఓ పోలింగ్ బూత్ కు వెళ్లిన హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత ఓటర్ల ఐడెంటిఫికేషన్ చెక్ చేశారు. బురఖాలు తీసి మరీ చూడడం వారిని అవమానించడమేనని పేర్కొంటూ ఎంఐఎం ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెపై కేసునమోదంది.
ఇదిలా ఉండగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆయన ఓటును వినియోగించుకునేందుకు మంగళ్ హాట్ పరిధిలోని ఎస్ఎస్ కే జూనియర్ కళాశాలకు వెళ్లారు. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ లోకి వెళ్లిన ఆయన పోలింగ్ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎన్నికల స్క్వాడ్ ఫిర్యాదు మేరకు మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు.