- వెతికి పెట్టాలని పహాడీ షరీఫ్ పీఎస్లో బీజేపీ నేతల ఫిర్యాదు
ఎల్బీనగర్, వెలుగు : చెరువు కనిపించండం లేదని.. వెతికి పెట్టాలని మహేశ్వరం బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఫిర్యాదు చేశారు. మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని సర్దార్ నగర్ కు చెందిన 8 ఎకరాల తుమ్మల చెరువును మాయం చేశారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ సోమవారం పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
నియోజకవర్గంలో అనేక చెరువులు కబ్జాకు గురవుతున్నాయని ఆయన తెలిపారు. దాదాపు 15 ఏండ్ల నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అండదండలతో బడంగ్పేట్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లు, జల్ పల్లి మున్సిపాలిటీలో వారి అనుచరులు చెరువులను విచ్చలవిడిగా కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. వీటిపై తమ పార్టీ నాయకులు పలుమార్లు తహసీల్దార్లు, కమిషనర్లు, కలెక్టర్లు
ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు కంప్లైంట్ ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 ఎకరాల తుమ్మలచెరువు రాత్రికి రాత్రి మాయమైపోయిందన్నారు. హైడ్రాను కేవలం హైదరాబాద్ కే పరిమితం చేయకుండా తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు.