తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక..మల్లెల తీర్థం మహా ఖననం

  • హైదరాబాద్​ బుక్ ఫెయిర్​లో వక్తలు

ముషీరాబాద్, వెలుగు : ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్​కు రద్దీ కొనసాగుతున్నది. స్టాళ్లన్ని పుస్తక ప్రియులతో నిండిపోతున్నాయి. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ శుక్రవారం బుక్ ఫెయిర్ ను సందర్శించారు. కవి సిద్ధార్థ రచించిన ‘మల్లెల తీర్థం మహా ఖననం’ పుస్తకాన్ని పీఓడబ్ల్యూ సంధ్య, కవి అసుర, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, బీఎస్ రాములు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ ఆవిష్కరించి మాట్లాడారు.

తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక ఈ కవిత్వమని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం కవులు, రచయితలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటోందని గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ అన్నారు. 37 ఏండ్ల చరిత్రలో మొదటిసారిగా సీఎం హోదాలో బుక్ ఫెయిర్ కు వచ్చి కవులు, రచయితలతోపాటు ప్రచురణ సంస్థలను గౌరవించారని తెలిపారు. అలాగే అరుణిమ నవల పుస్తకాన్ని బీఎస్ రాములు, ప్రొఫెసర్ కాశీం, పీఓడబ్ల్యూ సంధ్య కలిసి ఆవిష్కరించారు.

సీనియర్ జర్నలిస్ట్ పీవీ రావు రాసిన ‘వార్తలు సమాప్తం’ అనే పుస్తకాన్ని జూలూరి గౌరీ శంకర్ ఆవిష్కరించారు. పుస్తకం నివురుగప్పిన నిప్పులాంటిదని, రచయిత పీవీ రావు మనస్సును కదిలించిన ఘటనలను రాశారని తెలిపారు. బాలోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం బాలల హక్కులపై సెమినార్ నిర్వహించారు. చదువు ప్రాముఖ్యతను తెలిపే నాటికను పిల్లలు అద్భుతంగా ప్రదర్శించారు.