- బుక్ ఫెయిర్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
ముషీరాబాద్, వెలుగు: పుస్తక పఠనంతో లోతైన విజ్ఞానం సంపాదించుకోవచ్చని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవంలో పుస్తకాలు చాలా కీలకమన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను శనివారం సాయంత్రం దత్తాత్రేయ సందర్శించారు. పుస్తక ప్రియులతో మాట్లాడారు. స్టాల్స్ లోని పుస్తకాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత కోసం గ్రంథాలయాలను ప్రోత్సహించాలని, పుస్తకాలను చదివించాలని సూచించారు. లక్షలాది మంది ఆలోచనలను పుస్తక రూపంలోకి తెచ్చి ప్రజల్లోకి తీసుకువెళ్లే రచయితల కృషిని అభినందిస్తున్నానన్నారు. వీకెండ్ కావడంతో శనివారం బుక్ ఫెయిర్ కు సందర్శకులు భారీగా తరలివచ్చారు. దాదాపు 50 వేల మంది వచ్చారని నిర్వాహకులు తెలిపారు.