ఖైరతాబాద్, వెలుగు: హైదరాబాద్ బుక్ ఫెయిర్ తేదీలు ఖరారయ్యాయి. డిసెంబర్19 నుంచి 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో 37వ పుస్తక ప్రదర్శన జరగనుందని సొసైటీ ప్రకటించింది. సోమవారం ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ప్రెసిడెంట్ డాక్టర్ కవి యాకూబ్, సెక్రటరీ ఆర్. శ్రీనివాస్, అడ్వైజరీ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, సీనియర్ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి, రిటైర్డ్ ప్రొఫెసర్ రమా మెల్కోటే పాల్గొన్నారు.
బుక్ ఫెయిర్ లోగోను ఆవిష్కరించారు. సందర్శకులకు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. బుక్ ఫెయిర్లో స్టాల్స్ ఏర్పాటు చేయాలనుకునే వారు ఈ నెల15 వరకు దరఖాస్తులను సమర్పించాలని నిర్వాహకులు వెల్లడించారు. స్టాల్స్ కేటాయింపు లాటరీ పద్ధతిలో ఉంటుందని, ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా పారదర్శకంగా లైవ్లో చూపుతామన్నారు.