- పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు
- ఎమ్మెల్యేతోపాటు 20 మంది అనుచరులపైనా ఎఫ్ఐఆర్
- నిరసనకు దిగిన మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ నేతలు
- పోలీస్ స్టేషన్లకు వెళ్లి బీఆర్ఎస్ నేతలను కలిసిన ఎమ్మెల్సీ కవిత
గచ్చిబౌలి, వెలుగు: బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన పాడి కౌశిక్‌రెడ్డి, ఆయన అనుచరులు తన విధులకు ఆటంకం కలిగించారని సీఐ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్‌రెడ్డితోపాటు 20 మంది అనుచరులపైనా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం బంజారాహిల్స్ పోలీసులు కొండాపూర్‌లోని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోనే ఆయనను అరెస్ట్ చేసి, తమ కారులోనే బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
కౌశిక్‌రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.అంతకుముందు కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారనే విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీశ్‌రావు.. కౌశిక్‌రెడ్డి ఇంటికి చేరుకొని అతన్ని కలిసే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో హరీశ్‌రావు వాగ్వాదానికి దిగారు. దీంతో హరీశ్‌రావును అరెస్ట్ చేసి, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హరీశ్‌రావును తరలిస్తున్న పోలీసు వాహనాన్ని బీఆర్ఎస్మాజీ ఎమ్మెల్యేలు, లీడర్లు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకొని, గచ్చిబౌలి పీఎస్‌కు తరలించారు.
కౌశిక్‌రెడ్డి ఇంటి వైపు ఎవరిని రానినవ్వకుండా విల్లాస్మెయిన్ గేట్క్లోజ్చేసి, భారీగా పోలీసులను మోహరించారు. అప్పుడే అక్కడికి చేరుకున్న మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు.. కౌశిక్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో శంభీపూర్ రాజు విల్లాస్మెయిన్గేట్దూకి లోపలికి వెళ్లాడు. అక్కడే ఉన్న పోలీసులు జగదీశ్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, రాకేశ్ రెడ్డిని అరెస్ట్ చేసి, రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం శంభీపూర్‌రాజును అరెస్ట్ చేసి, గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
గచ్చిబౌలి స్టేషన్ ముందు బీఆర్ఎస్ నేతల ఆందోళన
హరీశ్‌రావును పోలీసులు అరెస్ట్ చేసి, గచ్చిబౌలికి తరలించడంతో.. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నేతలు భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అరెస్ట్ చేసిన తమ నాయకులను విడుదల చేయాలని ధర్నా చేపట్టారు. ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వివేకానంద గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. వారు పీఎస్ముందు ఆందోళనకు దిగారు. వారిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేసి, నగర శివారులోని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు.
ఇందిరమ్మ రాజ్యమా? ఎమర్జెన్సీ పాలనా?: హరీశ్ రావు
ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై ఉల్టా కేసు బనాయించారని హరీశ్‌రావు మండిపడ్డారు. ‘ఉదయాన్నే కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పదుల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి మీదకు వచ్చారు. అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే, నాపై, బీఆర్ఎస్ లీడర్లతో దుర్మార్గంగా ప్రవర్తించారు. మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేసి, పోలీస్‌స్టేషన్ కి తరలిస్తున్నారు” అని మండిపడ్డారు.
అడిగితే అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ.. రాక్షస పాలన కొనసాగిస్తున్నారంటూ మండిపడ్డారు. ‘‘రేవంత్ రెడ్డి.. నీ పిట్ట బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడేవాళ్లం కాదు. తెలంగాణ సమాజమే నీకు బుద్ధి చెబుతుంది’ అని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న తొలి తెలంగాణ ప్రభుత్వాన్ని ఏడాది కాకుండానే డబ్బు సంచులతో కూల్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారని ఆరోపించారు. కానీ, ఇప్పుడు మాత్రం ప్రతిపక్ష నాయకులు ఎలా ఉండాలో నీతులు వల్లిస్తున్నారని విమర్శించారు. రేవంత్‌ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుతో తలదించుకుంటుందని హరీశ్రావువిమర్శించారు.
ప్రశ్నించినందుకే కౌశిక్ రెడ్డిపై కేసులు: ఎమ్మెల్సీ కవిత
మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్సెల్సీలు, ఇతర బీఆర్ఎస్లీడర్లను పోలీసులు అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు తరలించగా, విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏసీపీకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని పాడి కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ స్టేషన్ కు వెళ్లారని, అక్కడ ఏసీపీ లేకపోవడంతో ఫిర్యాదు తీసుకోవాలని సీఐని కోరారని చెప్పారు.
సీఐని ప్రశ్నించినందుకు పాడి కౌశిక్ రెడ్డిపై కేసులు పెట్టారని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లినందుకు హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి, ఇతర నేతలను అరెస్టు చేశారని, ఫిర్యాదు తీసుకునే ధైర్యం ప్రభుత్వానికి లేదన్నారు. కౌశిక్ రెడ్డిపై కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని, అరెస్ట్ అయిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు ఇతర లీడర్లను కలిసి మాట్లాడారు.
కానిస్టేబుల్‌పై హరీశ్‌రావు ఫైర్
బీఆర్ఎస్ నేత హరీశ్‌రావుకు, పోలీసులకు మధ్య గురువారం ఉదయం వాగ్వాదం చోటుచేసుకున్నది. ‘నన్ను తమాషా చేయకు అంటావా’ అని కానిస్టేబుల్ పై హరీశ్‌రావు ఫైర్అయ్యారు. కొండాపూర్‌లోని కొల్ల లక్సేరియా విల్లాస్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారనే విషయం తెలుసుకున్న హరీశ్‌రావు, అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు హరీశ్‌ను అదుపులోకి తీసుకొని పోలీస్ వెహికల్లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేస్తుండగా.. వెహికల్ ఎక్కకుండా భీష్మించుకున్నారు.
ఈ సమయంలో హరీశ్‌రావు అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ మధ్య వాగ్వాదం జరిగింది. ''ఇంత కంటే ఎక్కువ చెయ్యకు.. తమాషా చేయకు.. అని అంటావా.. నువ్వో కానిస్టేబుల్‌వి’’ అంటూ హరీశ్ ఫైర్ అయ్యారు. దీంతో ఆ కానిస్టేబుల్ ‘‘సార్ నేను అలాంటి మాటలు అనలేదు’’ అంటూ రిప్లై ఇచ్చారు.