ఆన్లైన్ బెట్టింగ్ కు బలైపోతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఆన్లైన్ బెట్టింగ్ వల్ల అప్పుల ఊబిలో చిక్కుకొని బాధితులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే.. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్వచ్చంద సంస్థలు ఆన్లైన్ బెట్టింగ్ పట్ల అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ జనంలో మార్పు రావట్లేదు.ఇదిలా ఉండగా.. వరంగల్ లో మరో యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కు బలయ్యాడు. వరంగల్ జిల్లా వర్దన్న పేటకు చెందిన గణేష్ అనే 22 ఏళ్ళ బీటెక్ స్టూడెంట్ ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడి అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్ లోని ఓ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న గణేష్ బెట్టింగ్ యాప్స్ కు అలవాటు పడి.. స్నేహితుల దగ్గర అప్పులు చేశాడు. బెట్టింగ్ లో నష్టపోయి.. అప్పులు తీర్చలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. అక్టోబర్ 23న పురుగుల మందు తగిన గణేష్ ను హ్యదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ సోమవారం ( అక్టోబర్ 28, 2024 ) రాత్రి మరణించాడు.
గణేష్ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికందొచ్చిన కొడుకు అర్థాంతరంగా మరణించటంతో గణేష్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.