సంబురంగా బోనాలు..హైదరాబాద్ ​వ్యాప్తంగా వైభవంగా పండుగ

సంబురంగా బోనాలు..హైదరాబాద్ ​వ్యాప్తంగా వైభవంగా పండుగ
  • హైదరాబాద్ ​వ్యాప్తంగా వైభవంగా పండుగ
  • భక్తుల రద్దీతో కిక్కిరిసిన అమ్మవార్ల ఆలయ పరిసరాలు
  • పట్టు వస్త్రాలు సమర్పించిన డిప్యూటీ సీఎం 
  • వేడుకల్లో పాల్గొన్న మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం
  • బంగారు బోనం సమర్పించిన బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​ నగరంలో  బోనాల జాతర  సందడి నెలకొన్నది. ఆషాఢమాసం చివరి ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవార్లకు బోనం తీశారు. భక్తుల రద్దీతో ఓల్డ్​ సిటీలోని లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారితో పాటు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాలు కిక్కిరిసిపోయాయి. మహిళలు నెత్తిన బోనం పెట్టుకొని, కుటుంబ సభ్యులతో ఆలయాలకు తరలివచ్చారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారికి  డిప్యూటీ సీఎం  భట్టి విక్రమార్క దంపతులు  పట్టు వస్ర్తాలు సమర్పించారు. భట్టి సతీమణి మల్లు నందిని బంగారు బోనం ఎత్తుకున్నారు. భట్టి మాట్లాడారు. తెలంగాణ సుభిక్షంగా ఉండేలా దీవించాలని ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించామని తెలిపారు.  హైదరాబాద్​లో పటిష్టమైన శాంతిభద్రతలు నెలకొల్పడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు. హైదరాబాద్​ను సేఫ్టీ నగరంగా మారుస్తున్నామని తెలిపారు.  బోనాల పండుగ విజయవంతం కోసం ప్రభుత్వం తరఫున సకల సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం బోనాల ఉత్సవాల కోసం రూ.20  కోట్లు విడుదల చేశామని, హైదరాబాద్ నగర అభివృద్ధికి పటిష్టమైన పునాదులు వేసేందుకు ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయించినట్టు చెప్పారు.  ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా ఆశీస్సులు కలకాలం కొనసాగాలని ఆకాంక్షించారు.

బోనాలు.. హైదరాబాద్ కల్చర్​కు నిదర్శనం: మంత్రి పొన్నం

హైదరాబాద్​సంస్కృతికి బోనాలు నిదర్శనమని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. లాల్​ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరి  మీద ఉండాలని తాను కోరుకున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్న బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం తరఫున పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి  స్వయంగా బోనాల ఉత్సవాలకు నిధులు ఇచ్చారని, సీఎంతోపాటు మంత్రులు అందరూ సహకరించారని తెలిపారు. అలాగే, బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన హైదారాబాద్ జంట నగరాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు.  

పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలి: మంత్రి వెంకట్ రెడ్డి 

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆకాంక్షించారు.  కరోనా వంటి మహమ్మారులు రాకుండా ప్రజలందరినీ కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు. ‘‘అఖిలపక్ష నిర్ణయానికి తగ్గట్టుగా పాత డిజైన్ తో కొత్త ఉస్మానియా దవాఖాన నిర్మిస్తాం. హైదరాబాద్ తోపాటు వివిధ జిల్లాల ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్న మూసీ నదిని ప్రక్షాళన చేస్తున్నాం. పాతబస్తీ స్థితిగతులను మార్చేందుకు మెట్రోను విస్తరిస్తున్నాం. హైదరాబాద్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించాం” అని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంలో కుట్ర ఉందన్న బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించాలని అడిగిన మీడియా ప్రశ్నకు.. దేవాలయం దగ్గర రాజకీయాలు మాట్లాడటం భావ్యం కాదని అన్నారు. మేడిగడ్డ కుంగినప్పుడు అధికారంలో ఉన్నది కేటీఆరే అని తెలిపారు.  అయినా కుట్రలు చేస్తే డ్యామ్ లోపలికి ఎలా కుంగుతుందని ప్రశ్నించారు.  పోటీ చేసిన సగం సీట్లలో డిపాజిట్లు రాని ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఎద్దేవా చేశారు. 

రాష్ట్ర ప్రజలకు అమ్మవార్ల దీవెనలుంటయ్​: మంత్రి సీతక్క

మహేశ్వరం నియోజకవర్గంలోని ఎన్టీఆర్ నగర్, సరూర్ నగర్ లోని శ్రీ ఖిలా మైసమ్మ ఆలయంలో జరిగిన బోనాల ఉత్సవంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.  ప్రత్యేక పూజలు చేశారు.  అనంతరం ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. రాష్ట్ర  ప్రజలపై ఆ అమ్మవార్ల దీవెనలు మెండుగా ఉంటాయని అన్నారు.  బోనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించిందని, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడేలా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. ఆమె వెంట మహేశ్వరం కాంగ్రెస్ ఇన్ ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఉన్నారు. 

ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా  ఉండాలి:  మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్ నగరంలోని చిలకలగూడ కట్టమైసమ్మ, లాలాగూడ పోచమ్మ, లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారు, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయాల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బోనాలు సమర్పించారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకొని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడారు. తెలంగాణ  ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు ప్రజా ప్రభుత్వంగా బోనాల ఉత్సవాలను నిర్వహించడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. చిలకలగూడ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. నెల రోజులుగా బోనాల జాతర ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేశారని తెలిపారు. ప్రజలు ఆకాంక్షించిన తెలంగాణ సాకారం దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నాయకత్వంలో తమ ప్రభుత్వం ముందుకు సాగేలా శక్తియుక్తులను ప్రసాదించాలని ప్రార్థించినట్లు తెలిపారు.