సాలిడ్ వేస్ట్ మేనేజ్​మెంట్​లో సిటీ బెస్ట్

సాలిడ్ వేస్ట్ మేనేజ్​మెంట్​లో సిటీ బెస్ట్

హైదరాబాద్, వెలుగు :ఘన వ్యర్థాల నిర్వహణలో హైదరాబాద్ సత్తా చాటుతోంది. గతంలో స్వచ్ఛ సర్వేక్షణ్ లో ఉత్తమ రాజధానిగా నిలవగా, మరోసారి దేశంలోనే రెండో స్థానం తెలంగాణకు దక్కింది. ఛత్తీస్ ఘడ్ అగ్రస్థానంలో ఉంది. అయితే రాష్ట్రంలో ఉత్పత్తయ్యే ఘన వ్యర్థాల పరిమాణం సిటీలోనే ఎక్కువగా ఉండగా, నిర్వహణలోనూ హైదరాబాద్ కీలకం. ఈ క్రమంలో ఇటు జీహెచ్ఎంసీ చేపట్టిన కార్యక్రమాలు, అవగాహనతో ఘన వ్యర్థాల నిర్వహణ భేషుగ్గా సాగుతున్నాయి.

సిటీలో సాలిడ్ వేస్ట్ సేకరణ పకడ్బందీగా సాగుతోంది. తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించేలా 45లక్షల డస్ట్ బీన్లు జీహెచ్ఎంసీ ఇంటింటికీ పంపిణీ చేసింది. దీంతోపాటు ప్రధానమై కూడళ్ల వద్ద ఉన్న గార్బెజ్ పాయింట్లను తీసివేయడంతోపాటు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకున్నది. దీనికి నగర పౌరులను, స్వచ్ఛంద సేవా ప్రతినిధులను, అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తూ చెత్త నిర్వహణను సజావుగా సాగేల గత రెండేళ్లుగా కృషి చేస్తోంది. దీంతోపాటు ఉత్పత్తయ్యే వ్యర్థాలను సమర్థంగా రీసైక్లింగ్, రీయూజ్ చేసేలా పర్యవేక్షించడంతో మంచి ఫలితాలను ఇచ్చింది. తెలంగాణలో ప్రతి ఏటా 26లక్షల మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అయితే, ఇందులో హైదరాబాద్ వాటానే దాదాపు 18లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుంది. ఇందులో దాదాపు 73 శాతం ఘన వ్యర్థాలను ఆధునిక పద్ధతులతో వేరు చేయడంతోపాటు రీసైక్లింగ్ చేసే యంత్రాంగాన్ని బలోపేతం చేయడంతో జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణ  తర్వాత స్థానాల్లో మధ్య ప్రదేశ్​, కేరళ, యూపీ, గుజరాత్ రాష్ట్రాలు ఉండగా, అత్యంత కింది స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఉన్నట్లు  కేంద్ర పర్యావరణ శాఖ తాజాగా వెల్లడించింది.

ఏటేటా  పెరుగుతున్న పరిమాణం

సిటీలో ఇంటింటిలో ఉత్పత్తి అవుతున్న ఘనవ్యర్థాలను సేకరించడంలో  అధికారులు దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా వెయ్యికిపైగా ఉన్న ఓపెన్ గార్బెజ్ పాయింట్లను ఎత్తివేయడంతోపాటు ప్రతి ఇంటి నుంచి చెత్త  సేకరించేలా దాదాపు 45లక్షల డస్ట్ బిన్లను జీహెచ్ఎంసీ పంపిణీ చేసింది. అదే విధంగా చెత్త సేకరించే పారిశుద్ధ్య కార్మికులకు త్రీ వీలర్ తోపాటు, రిక్షాలను ఇవ్వడంతో మరింత సులభంగా చెత్త సేకరణ సాధ్యమవుతోంది. దీంతో ఏటేటా ఘన వ్యర్థాల పరిమాణం పెరిగిపోతుంది. అయితే సేకరణ, నిర్వహణ యంత్రాంగాలు పటిష్టంగా ఉండటంతో ఎలాంటి దుష్ప్రరిణాలు లేకుండానే నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడానికి వీలువుతుందనీ జీహెచ్ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. 2014లో 11లక్షల మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అయితే, 2019 జనవరి నాటికి ఏకంగా 18లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. అయినా, వీటిని 80శాతానికి జవహర్ నగర్ డంప్ యార్డుకు తరలించి శుద్ధి చేస్తున్నారు.

విపరీతంగా ఉత్పత్తి అవుతున్న ఘన వ్యర్థాలతో పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. ఈ క్రమంలో ఢిల్లీ, బెంగుళూర్ లాంటి నగరాలకు ధీటుగా హైదరాబాద్ లో నిర్వహణ ప్రక్రియ సజావుగా సాగడంపై అధికారులు, సిటీ పౌరుల భాగస్వామ్యంతోనే వీలవుతుందని, ముఖ్యంగా ప్రజా చైతన్యంతోనే సమర్ధవంతంగా వాతావరణాన్ని పరిరక్షించుకోవచ్చని పర్యావేత్తలు చెబుతున్నారు. అయితే సిటీలో ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై నిషేధం ఉన్నా  వాడకం మాత్రం తగ్గడంలేదని చెబుతున్నారు.
ప్లాస్టిక్ వాడకాన్ని కూడా అదుపులో ఉంచగలిగితే పర్యావరణానికి ఎంతో మేలు చేసినట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.