హైదరాబాద్ సిటీ బస్సుల్లో.. క్యూఆర్ కోడ్ ​స్కాన్ చేసి పే చేయండి.. టికెట్ తీసుకోండి..!

హైదరాబాద్ సిటీ బస్సుల్లో.. క్యూఆర్ కోడ్ ​స్కాన్ చేసి పే చేయండి.. టికెట్ తీసుకోండి..!

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే వారిలో చాలా మంది చిల్లర సమస్య ఎదుర్కొన్న వారే. చిల్లర తీసుకురాకుండా సతాయిస్తున్నారని కండక్టర్లు, డబ్బులు ఉన్నా ఇవ్వకుండా కండక్టర్లు పరేషాన్​చేస్తున్నారని ప్యాసింజర్లు ఎప్పుడూ గొడవలు పడుతుండేవారు. కొన్నిసార్లు కొట్టుకుని పోలీస్​స్టేషన్లకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సమస్యలకు చెక్​పెడుతూ ఆర్టీసీ అధికారులు సోమవారం నుంచి 25 డిపోల పరిధిలోని బస్సుల్లో డిజిటల్​పేమెంట్స్కు అవకాశం కల్పించారు.

ప్రతి కండక్టర్కు టిమ్​మెషీన్ ​ఇచ్చి యూపీఐ పేమెంట్ ఆప్షన్కు ఛాన్స్​ఇవ్వడంతో దాదాపు 70 శాతం ప్యాసింజర్లు క్యూ ఆర్​కోడ్​స్కాన్​చేసి టికెట్లు కొనుక్కున్నారు. దీంతో ఏండ్లుగా కొనసాగుతున్న చిల్లర సమస్యకు ముగింపు పలికినట్టయ్యింది. వాస్తవానికి, డిజిటల్​పేమెంట్స్ను బండ్లగూడ, దిల్​సుఖ్​నగర్​రూట్లలో కొంతకాలం కిందటే ప్రారంభించారు. దీనికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో సిటీలోని మిగతా ప్రాంతాల్లో సోమవారం నుంచి అమల్లోకి తెచ్చారు.

త్వరలో కార్డు స్వైపింగ్​?
గ్రేటర్​పరిధిలో 25 బస్​ డిపోలకు 6వేల ఆటోమేటిక్​ ఫెయిర్​కలెక్టర్​సిస్టమ్​(టిమ్స్​)ను పంపిణీ చేశామని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. కండక్టర్లకు యూపీఐ విధానంలో టికెట్​ఎలా ఇష్యూ చేయాలనేదానిపై ట్రైనింగ్​ఇచ్చామని, త్వరలో కార్డు స్వైపింగ్​విధానంలోనూ టికెట్ల జారీకి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.  

తిప్పలు తప్పినయ్
నేను బంజారాహిల్స్లో జాబ్​చేస్తా...రోజూ మర్రిపల్లి నుంచి కోఠికి 201 ఎమ్​బస్సులో వస్తా..ఇది బండ్లగూడ డిపో పరిధిలో ఉంటుంది..ఈ బస్సులో ఎప్పటినుంచో యూపీఐ పేమెంట్​ఆప్షన్​ఉండడంతో ఇబ్బందులు వచ్చేవి కావు. కానీ, కోఠి నుంచి 127కే లో బంజారాహిల్స్​కు వచ్చే బస్సులో చిల్లర కోసం ఇబ్బంది పడేవాడిని.. ఇప్పుడు సిటీ అంతా డిజిటల్​పేమెంట్​ఆప్షన్​తీసుకువచ్చారు...ఇక చిల్లర తిప్పలు తప్పినట్టే.

వెంకటేశ్, ప్రైవేట్ ​ఎంప్లాయ్

స్కానింగ్ లేదా అని అడిగెటోళ్లు
ఆర్టీసీ బస్సుల్లో ఈ చిల్లర సమస్య ఎప్పటినుంచో ఉంది. సిటీ బస్సుల్లో కూడా 500 ఇచ్చి చిల్లర అడిగేవాళ్లు ఉన్నరు. అలాంటి సందర్భాల్లో గొడవలు జరుగుతూ ఉండేవి. చాలామంది ఫోన్​పే లేదా గూగుల్​పే లేదా స్కానింగ్​లేదా అని అడిగేవాళ్లు. దీన్ని గుర్తించిన మేనేజ్​మెంట్​టిమ్​మెషీన్స్​ఇవ్వడంతో చిల్లర కష్టాలు తీరినట్టయ్యింది.

సుధాకర్, కండక్టర్