మంత్రి కొండా సురేఖపై సిటీ సివిల్​ కోర్టు సీరియస్​ : బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అసభ్యకర వ్యాఖ్యలా?

మంత్రి కొండా సురేఖపై సిటీ సివిల్​ కోర్టు సీరియస్​ : బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అసభ్యకర వ్యాఖ్యలా?

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మంత్రి కొండా సురేఖపై సిటీ సివిల్‌‌‌‌ కోర్టు సీరియస్ అయింది. బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి సినీ నటులు అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌‌‌‌‌‌‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని పేర్కొంది.  కేటీఆర్ దాఖలు చేసిన రూ.100 కోట్ల పరువు నష్టం దావా కేసుపై సిటీ సివిల్‌‌‌‌ కోర్టు శుక్రవారం విచారణ జరిపింది. కేటీఆర్ తరఫున న్యాయవాదులు దాఖలు చేసిన ఆరు పిటిషన్స్‌‌‌‌పై తప్పనిసరి మధ్యంతర ఇంజక్షన్‌‌‌‌ ఉత్తర్వులిచ్చింది. 

ఓ మహిళా మంత్రిగా ఉండి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొన్నట్టు తెలిసింది. మరోసారి ఇలాంటి కామెంట్స్​ రిపీట్​ కాకుండా చూసుకోవాలని కోర్టు సూచించింది. సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌ఫామ్స్​, వెబ్‌‌‌‌సైట్స్, మెయిన్​స్ట్రీమ్​ మీడియానుంచి తొలగించాలని ఆయా యాజమాన్యాలకు ఆర్డర్స్​ జారీ చేసింది. మంత్రి కొండా సురేఖ  చేసిన వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయని, ఆమె చేసిన కామెంట్లకు సంబంధించిన అన్ని కథనాలు, వీడియోలు పబ్లిక్ డొమెయిన్‌‌‌‌లో ఉండకూడదని స్పష్టం చేసింది.