
- మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 8 వరకు110 డెసిబుల్స్ రికార్డ్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలో మోత మోగిపోతున్నది. వచ్చే వాహనం.. పోయే వాహనం అన్నట్టుగా నగరంలో చెవులకు చిల్లులు పడేలా సౌండ్ పొల్యూషన్ నమోదవుతున్నది. సిటీలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్, వాహనాల హారన్లు, నియంత్రణలేని నిర్మాణాలతో శబ్దాలు పరిమితికి మంచి నమోదవుతున్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) నిర్దేశించిన 55 డెసిబుల్స్(ఉదయం), 45 డెసిబుల్స్(రాత్రి)కి మించి సౌండ్లు వస్తున్నాయి.
ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ చేసిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. గచ్చిబౌలి నుంచి జీడిమెట్ల,ఉప్పల్, ఫలక్నుమ మార్గాల్లో ట్రిపుల్ఐటీ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్ జోన్లలో సౌండ్ బాగా పెరిగిపోయినట్టు ఈ స్టడీలో నిర్ధారించారు. ఉదయంతో పోలిస్తే సాయంత్రం పూట శబ్దాలు విపరీతంగా నమోదవుతున్నాయని తేల్చారు.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యన సౌండ్ పొల్యూషన్ 50 డెసిబుల్స్ నుంచి 100 డెసిబుల్స్ వరకు రికార్డయితే.. మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 8 గంటల మధ్య సౌండ్ పొల్యూషన్ 110 డెసిబుల్స్ వరకు పెరుగుతున్నట్టు గుర్తించారు. ప్రధానంగా గచ్చిబౌలి నుంచి ఉప్పల్ వెళ్లే మార్గంలోనే అత్యధికంగా సౌండ్ పొల్యూషన్ నమోదవుతున్నట్టు వెల్లడైంది.