
- పెండింగ్‌లో రూ.1,180 కోట్లు
- ప్రతి నెలా మెయింటెనెన్స్పేరుతో రూ.32 లక్షలు విడుదల
- సిటీలోని 82 లైబ్రరీలకు సరిపోని పైసలు
హైదరాబాద్ సిటీ, వెలుగు:లైబ్రరీల్లో సౌకర్యాలు కల్పించలేక ఇబ్బందులు పడుతున్నామని, బల్దియా నుంచి తమకు రావాల్సిన సెస్ డబ్బులు చెల్లించాలని సిటీ లైబ్రరీ విజ్ఞప్తి చేస్తోంది. సుమారు పదేండ్లుగా నామమాత్రంగా చెల్లిస్తుండడంతో ప్రతిరోజూ లైబ్రరీలకు వచ్చే వేలాది మంది స్టూడెంట్స్‌కు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. ఒక్క అశోక్ నగర్ లోని సిటీ లైబ్రరీకే రోజూ వందలాది మంది వస్తుంటారు. నిధులు లేక వీరికి కావాల్సిన బుక్స్కూడా కొనలేకపోతున్నారు.
2014 నుంచి ఇప్పటివరకు బల్దియా రూ.1,180 కోట్లు ఇవ్వాలని, వాటిని చెల్లిస్తే లైబ్రరీలను డెవలప్చేసుకుంటామని ఆ శాఖ అధికారులు కోరుతున్నారు. గత బీఆర్ఎస్ప్రభుత్వం నెలకి రూ.15 లక్షలు మాత్రమే ఇచ్చిందని, ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచి రూ.25 లక్షలు ఇచ్చిందంటున్నారు. కానీ, కాంగ్రెస్ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెలకి రూ.36 లక్షలు ఇస్తోందని, అయినా సరిపోవడం లేదంటున్నారు.
ప్రాపర్టీ ట్యాక్స్‌లో 8 శాతం లైబ్రరీ సెస్
సిటీజనం నుంచి బల్దియా ప్రాపర్టీ ట్యాక్స్‌లో 8 శాతం గ్రంథాలయ సెస్ కలిపి తీసుకుంటోంది. అయినా ఈ డబ్బులను లైబ్రరీలకు ఇవ్వడంలేదు. కేవలం ప్రతినెల మెయింటెనెన్స్కోసం అంటూ కొంత డబ్బు చెల్లిస్తోంది. వీటితో పాటు కొన్ని బిల్డింగుల నిర్మాణం, రినోవేషన్ కోసం కలిపి 2014 నుంచి ఇప్పటి వరకు రూ.56 కోట్లు మత్రమే ఇచ్చింది. ఈ పదేండ్లలో మొత్తం రూ.1,236 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, 56 కోట్లు చెల్లించింది. ఇంకా రూ.1,180 కోట్లు బకాయి పడింది.
సిటీలో 82 లైబ్రరీలు....
సిటీలో అశోక్ నగర్ లోని లైబ్రరీ సహా మొత్తం 82 లైబ్రరీలు ఉన్నాయి. ఇందులో సొంత భవనాలు 69 ఉండగా, 5 బిల్డింగులు అద్దె ప్రాతిపదికన కొనసాగుతోంది. నాలుగు బల్దియా బిల్డింగుల్లో ఉచితంగా కొనసాగుతున్నాయి. ఇందులో ప్రస్తుతం 33 బిల్డింగుల రినోవేషన్ జరుగుతోంది. మరో 14 బిల్డింగుల నిర్మాణం జరుగుతోంది. కరోనాకు ముందు సిటీలో 90 లైబ్రరీలు ఉండగా, ఇందులో బిల్డింగ్స్, స్టాఫ్ కొరత కారణంగా ఎనిమిదింటిని మూసేశారు. ఎసీ గార్డ్స్, చంచల్ గూడ, హిమాయత్ నగర్, మురద్ నగర్, వాల్మీకి నగర్ బ్రాంచీ లైబ్రరీలతో పాటు మూడు మొబైల్లైబ్రరీలను కరోనాకి ముందే క్లోజ్చేశారు. అవకాశం ఉంటే వీటిని తిరిగి తెరవడంతో పాటు మరిన్ని ప్రాంతాల్లో లైబ్రరీలను ఏర్పాటు చేయాలని పోటీ పరీక్షలకు ప్రిపేర్అవుతున్న అభ్యర్థులు, పుస్తక ప్రియులు కోరుతున్నారు.
పేద విద్యార్థులు, నిరుద్యోగులకు మేలు
సిటీలో లైబ్రరీలతో పేద విద్యార్థులు, నిరుద్యోగులకే ఎక్కువగా మేలు జరుగుతుంది. వివిధ జిల్లాల నుంచి రాజధానికి వచ్చే పేద విద్యార్థులు ప్రైవేట్ స్టడీ హాల్స్ కి వెళ్లడం భారమే.. అదే లైబ్రరీల్లో అయితే ఫ్రీగా చదువుకోవచ్చు. బీఆర్ఎస్హయాంలో పదేండ్లు వేచి చూసినా నోటిఫికేషన్ల రాలేదు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పటికే కొన్ని పోటీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా ప్రకటించి నియామకాలు కూడా చేశారు.
అలాగే జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో నిరుద్యోగులు, విద్యార్థులు సిటీ లైబ్రరీతో పాటు మిగతా లైబ్రరీలకు క్యూ కడుతున్నారు. అయితే అక్కడ కావాల్సిన బుక్స్, ఫెసిలిటీస్లేక సతమతమవుతున్నారు. దీంతో బల్దియా నుంచి రావాల్సిన సెస్‌ను ప్రభుత్వం ఇప్పించాలని చొరవ కోరుతున్నారు.