హైదరాబాద్ సిటీలో కలకలం.. పాతబస్తీలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో ఒక్కసారి కలకలం.. ఏం జరిగిందో అర్థం కాక స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఇంతకీ పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపింది ఎందుకో తెలుసా.. చైన్ స్నాచర్స్ ను పట్టుకునేందుకు.. ఈ పూర్తి వివరాల్లోకి వెళితే...
హైదరాబాద్ ఓల్డ్ సిటీ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివశక్తి నగర్ ఏరియాలో 2024, జూన్ 24వ తేదీ ఉదయం కొందరు చైన్ స్నాచర్స్ తెగబడ్డారు. రోడ్డుపై నడుస్తూ వెళుతున్న మహిళల మెడలోని బంగారం గొలుసులను తెంపుకుని పారిపోతున్నారు చైన్ స్నాచర్స్.. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు.. చైన్ స్నాచర్స్ ను పట్టుకునేందుకు వెంట పడ్డారు. చిక్కినట్లే చిక్కి పారిపోతున్న దొంగలను పట్టుకునేందుకు.. వాళ్లను భయపెట్టేందుకు రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు పోలీసులు.
గాల్లోకి పోలీసుల కాల్పులతో చైన్ స్నాచర్స్ కంగారు పడ్డారు. ఈ సమయంలో పోలీసులు అత్యంత చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన చైన్ స్నాచర్స్ లో ఒకరి పేరు అమీర్ అని వెల్లడించారు. మిగతా వాళ్ల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు సైదాబాద్ పోలీసులు.