- తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు
- ఇప్పటికే ఆధారాలతో వీడియోను జనం ముందుంచినం
- దాన్ని తప్పుదోవ పట్టించేలా కొందరు ప్రయత్నిస్తున్నరు
- కేసు విచారణలో ఉన్నప్పుడు సొంత వ్యాఖ్యానాలను సహించం
- ఘటనపై ఏదైనా అదనపు సమాచారం ఉంటే ఇవ్వొచ్చని సూచన
హైదరాబాద్, వెలుగు: సంధ్య టాకీస్ తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని హైదరాబాద్ సిటీ పోలీసులు హెచ్చరించారు. ప్రజలను అపోహలకు గురిచేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీసు శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచిందని పేర్కొన్నారు. అయినా... కొందరు తప్పుదోవ పట్టించేలా, అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు క్రియేట్ చేసిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా పోస్టు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు.
కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఈ విషయంలో పోలీసు శాఖను బద్నాం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్ గా పరిగణిస్తామని.. ఒక అమాయకురాలి మరణం, ఒక పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం సంభవించిన ఈ కేసులో పోలీసు శాఖ ఎంతో నిబద్ధతతో విచారణ జరుపుతున్నదని పోలీసులు పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఎవరివద్దనైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే పోలీసు శాఖకు అందించాలని సూచించారు.