వాగులు కాదు రోడ్లు.. ఇది మన హైదరాబాదే

వాగులు కాదు రోడ్లు.. ఇది మన హైదరాబాదే

వానలొద్దు బాబోయ్.. వానలొద్దు.. ఎలాగోలా బతుకుతాం.. సగటు నగర వాసుల నోటి నుంచి వస్తున్న మాటలివి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు చుక్కలు చూస్తున్నారు. వరద నీరు ఇళ్లలోకి చేరుతుండడంతో వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఒకవైపు దుర్వాసన, మరోవైపు నీరు నిల్వ ఉండటంతో తినడానికి వంట కూడా వండుకోలేని పరిస్థితివచ్చిందని వారు వాపోతున్నారు. నగరంలో పలు చోట్ల ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి.

అత్యవసరం ఉన్న వారు తప్పనిసరి పరిస్థితులలో వర్షపు నీటిలోనే అడుగులు వేస్తున్నారు. గతంలో మ్యాన్ హోల్స్ తెరిచి ఉండి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు వారిని మరింత భయపెడుతున్నాయి. పలు చోట్ల సామాన్యులే ట్రాఫిక్ సిబ్బంది అవతారమెత్తారు. రోడ్లపై నిల్చొని వాహనదారులను, ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా సహాయం చేస్తున్నారు.

నిండుకుండలా హుస్సేన్‌సాగర్ 

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్‌సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండంతో నీటిమట్టం అంతకంతకూ పైకి చేరుతోంది. పరిశీలించిన జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత హుస్సేన్ సాగర్ దిగువన ఉన్న కాలనీలోని ప్రజలను అప్రమతంగా ఉండాలని సూచించారు.