హైదరాబాద్, వెలుగు: వర్ష ప్రభావిత ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ సహాయ చర్యలు రాత్రింబవళ్లు కొనసాగుతున్నాయి. బల్దియా కమిషనర్ దానకిశోర్ ఆదేశాలతో అధికారులు, సిబ్బంది దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులను ప్రాధాన్యంగా తీసుకున్నారు. భారీ వర్షాలతో సిటీలోని రహదారులపై 4 వేల గుంతలు ఏర్పడ్డాయని, 987 చోట్ల రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో 24గంటలు మరమ్మతులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే గుంతల పూడ్చివేత, దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ కోసం రూ.50 కోట్లను మంజూరు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దానకిశోర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారు.
వాటర్ లెవల్పై ఫోకస్
రోడ్ల మరమ్మతులు, గుంతల పూడ్చివేత పనులను జీహెచ్ఎంసీ సీనియర్ అధికారులు,విజిలెన్స్ విభాగం, ఇంజినీర్లు పరిశీలిస్తున్నారు. బల్దియా వద్ద అందుబాటులో ఉన్న వెయ్యి షేల్మాక్ బీటీ మిశ్రమం బ్యాగులతో పనులు కొనసాగిస్తున్నారు. మరో 2వేల బీటీ మిశ్రమం బ్యాగులను సేకరిస్తున్నారు. ఆదివారం కాస్త తెరిపినిచ్చినప్పటికీ కొన్ని చోట్ల ముసురు పట్టే ఉంది. మరో రెండు రోజుల పాటు విస్తృత స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దానకిశోర్ ఆదేశించారు.
నిరంతర వర్షాలతో గోడలు తడిసిన నేపథ్యంలో పురాతన, శిథిల భవనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పాఠశాల భవనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు చేరుతున్నందున నీటి మట్టాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని చెప్పారు. కూకట్‌పల్లి జోన్‌లోని సుచిత్ర జంక్షన్, చింతల్, బాలానగర్, మియాపూర్‌లో జరుగుతున్న రోడ్ల మరమ్మతులను దానకిశోర్ ఆదివారం పరిశీలించారు.