HMDA పరిధిని విస్తరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు.. ఫుల్ డీటైల్స్ ఇవే..

HMDA పరిధిని విస్తరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు.. ఫుల్ డీటైల్స్ ఇవే..

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(HMDA) పరిధిని విస్తరిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏ పరిధిలోకి మరో 36 రెవెన్యూ విలేజ్లు వచ్చి చేరాయి. హెచ్ఎండీఏ పరిధిలోకి 1355 గ్రామాలు, 104 మండలాలు, 11 జిల్లాలను చేర్చారు. విస్తరణ తర్వాత HMDA పరిధి10 వేల 472.72 చదరపు కిలోమీటర్లకు చేరింది. హైదరాబాద్‌‌తో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం1975లో హైదరాబాద్‌‌ అర్బన్‌‌ డెవలప్మెంట్‌‌ అథారిటీ(హుడా)ని 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటు చేశారు.

2008లో అప్పటి ప్రభుత్వం హుడాను హెచ్ఎండీఏగా మార్చింది. దీంతో హెచ్‌‌ఎండీఏ పరిధి 7,257 చదరపు కిలోమీటర్లకు పెరిగింది.  విస్తరణ తర్వాత HMDA పరిధి10 వేల 472.72 చదరపు కిలోమీటర్లకు చేరింది.  రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థల్లో హెచ్‌‌ఎండీఏ ప్రత్యేకం. సొంతంగా ఆదాయ వనరులు సమకూర్చుకుంటూ మహానగర విస్తరణలో కీలకంగా వ్యవహరిస్తోంది. గతంలో హుడాగా ఉన్నప్పుడు, ఆ తర్వాత హెచ్‌‌ఎండీఏగా అవతరించిన తర్వాత నగర విస్తరణలో భాగంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది.

ALSO READ | గవర్నర్లు మారినా స్పీచ్​ మారలే.. సీఎం స్తుతి, అసత్యాలు తప్ప కొత్తగా ఏం లేదు: మాజీ మంత్రి హరీశ్ రావు

దేశంలో ఏ మెట్రోపాలిటన్‌‌ సిటీకి లేనివిధంగా15 ఏండ్ల క్రితమే హైదరాబాద్‌‌కు ఔటర్‌‌ రింగ్‌‌ రోడ్డును హెచ్‌‌ఎండీఏ నిర్మించింది. ఏటా కనీసం రూ.500 కోట్ల ఆదాయం వచ్చే విధంగా ఓఆర్‌‌ఆర్‌‌కు రూపకల్పన చేసింది. అంతర్జాతీయ ఎయిర్‌‌పోర్టు నిర్మాణంలోనూ కీలకంగా వ్యవహరించి.. పీవీ ఎక్స్‌‌ప్రెస్ వేను నిర్మించింది. తెలుగుతల్లి, బషీర్‌‌బాగ్‌‌, హైటెక్‌‌ సిటీ తదితర పదికిపైగా ప్లైఓవర్లను నిర్మించి నగరవాసులకు ట్రాఫిక్‌‌ చిక్కులు లేకుండా చేసింది.

గత ప్రభుత్వ హయాంలో కోకాపేట, బుద్వేల్‌‌, మోకిల్లా, బాచుపల్లి, మేడిపల్లి, బహదూర్‌‌పల్లి, తొర్రూర్, కుర్మల్‌‌గూడ, తుర్కయాంజల్‌‌.. ఇలా నగరం నలువైపులా రూ.వేల కోట్ల విలువ చేసే స్థలాలను కూడా లేఅవుట్లుగా తీర్చిదిద్ది హెచ్ఎండీఏ విక్రయించింది. ఇలా పదేండ్లలో ప్రభుత్వం నుంచి హెచ్‌‌ఎండీఏకు వచ్చిన నిధుల కంటే హెచ్‌‌ఎండీఏ నుంచి ప్రభుత్వానికి వచ్చిన రాబడే అధికంగా ఉండటం విశేషం. ట్రిపుల్​ఆర్తో(రీజనల్ రింగ్ రోడ్) భూముల ధరలు ఇప్పటికే పెరగ్గా హెచ్ఎండీఏ విస్తరణ తర్వాత కొత్తగా కలిసిన జిల్లాల్లోనూ రియల్​ఎస్టేట్​మరింత పుంజుకుంటుందని రియల్టర్లు నమ్మకంగా చెబుతున్నారు.