హైదరాబాద్ భూగర్భ జలాల్లో డేంజర్​ కెమికల్స్​

  • హైదరాబాద్ భూగర్భ జలాల్లో డేంజర్​ కెమికల్స్​
  • ఫార్మా, ఆగ్రో కంపెనీల వ్యర్థాలతో కలుషితమవుతున్న నీళ్లు  
  • యూనివర్సిటీల సైంటిస్టుల స్టడీలో వెల్లడి 
  • 8 ప్రాంతాల్లోని బోర్ వెల్స్ నుంచి వాటర్ శాంపిల్స్ సేకరణ
  • టాయిలెట్ వ్యర్థాలూ భూగర్భజలాల్లోకి చేరుతున్నట్టు వెల్లడి 

సికింద్రాబాద్, వెలుగు :  హైదరాబాద్ నగరంలోని భూగర్బ జలాలు విషతుల్యంగా మారుతున్నాయి. ఫార్మా, ఆగ్రో కెమికల్ కంపెనీలు విడుదల చేస్తున్న రసాయన వ్యర్థాలు భూగర్బ జలాల్లోకి చేరి వాటిని కలుషితం చేస్తున్నాయి. ‘‘ఫార్మాస్యూటికల్స్ అండ్ ఆగ్రో-కెమికల్స్ ఇన్ గ్రౌండ్ వాటర్ ఆఫ్ హైదరాబాద్’’ అనే అంశంపై పలు యూనివర్సిటీల సైంటిస్టులు నిర్వహించిన అధ్యయనంలో ఈ మేరకు సిటీ భూగర్భ జలాల్లో ప్రమాదకర స్థాయిలో ఫార్మా, ఆగ్రో వ్యర్థాల అవశేషాలు ఉన్నట్లు వెల్లడైంది. హైదరాబాద్ లోని మహీంద్రా యూనివర్సిటీ, కందిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, థాయిలాండ్​లోని బయో రిఫైనరీ సిరింధోర్న్ ఇంటర్నేషనల్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ సెంటర్, జర్మన్ గ్రాడ్యుయేట్స్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, కింగ్ మోన్​గట్ యూనివర్సిటీ బ్యాంకాక్ కు చెందిన సైంటిస్టుల బృందం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి భూగర్భ జలాల శాంపిల్స్ ను సేకరించారు. వాటిపై ‘లిక్విడ్ క్రోమాటోగ్రఫీ’ టెక్నాలజీని ఉపయోగించి అధ్యయనం చేశారు. దీంతో ఆ శాంపిల్స్ లో సుమారు 250 రకాల కాలుష్య కారకాలు ఉన్నట్లుగా బయటపడింది. 

8 ప్రాంతాల నుంచి శాంపిళ్లు 

సిటీ భూగర్భ జలాల్లో కాలుష్యాన్ని అధ్యయనం చేసేందుకు సైంటిస్టులు ఫార్మా కంపెనీలు ఉన్న 8 ప్రాంతాల(బేగంపేట, భరత్​నగర్, దుండిగల్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, సనత్​నగర్, తార్నాక, తిరుమలగిరి)లోని బోర్ వెల్స్ నుంచి ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో వాటర్ శాంపిల్స్ సేకరించారు. వాటిని అనాలసిస్ చేసిన తర్వాత 250 రకాల రసాయన అవశేషాలను గుర్తించారు. ఇందులో ఆగ్రో సంబంధమైన హెర్బిసైడ్స్, ఫంగిసైడ్స్, పెస్టిసైడ్స్ ను ఫార్మా సంబంధమైన స్టిరాయిడ్స్, కాస్మోటిక్స్, సైనో టాక్సిన్స్ వంటి రసాయన అవశేషాలను కనుగొన్నారు.  

70%పైగా ఫార్మా, ఆగ్రో వ్యర్థాలే 

సైంటిస్టులు సేకరించిన భూగర్బ జలాల శాంపిల్స్ లోని కాలుష్య కారకాల్లో అత్యధికంగా 70 శాతానికి పైగా ఫార్మా స్యూటికల్, ఆగ్రో కెమికల్స్ అవశేషాలు ఉన్నట్లుగా గుర్తించారు. అన్ని శాంపిల్స్ లోనూ ఫార్మా అవశేషాలు అత్యధికంగా 50 శాతానికిపైగా ఉన్నట్లు స్టడీలో తేలింది. ఆ తర్వాత ఆగ్రో కెమికల్స్ వ్యర్థాలు అయిన పురుగుమందులు, కలుపు మందులు, శిలీంధ్రాలు, తెగుళ్ల నివారణ మందుల అవశేషాలు 10 నుంచి 20 శాతం మధ్య ఉన్నట్లు వెల్లడైంది. భూగర్భ జలాల శాంపిల్స్ సేకరించిన ప్రాంతాల్లో సుమారు 200కుపైగా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. సనత్ నగర్ నుంచి సేకరించిన శాంపిల్స్ లో 63 శాతం ఫార్మా వ్యర్థాల అవశేషాలు, 20 శాతం ఆగ్రో కెమికల్స్ ఉన్నట్టు తేలింది. బేగంపేట నుంచి తీసుకున్న శాంపిల్స్ లోనూ ఫార్మా, ఆగ్రో అవశేషాలు దాదాపుగా ఇదే స్థాయిలో ఉన్నట్లు వెల్లడైంది. ఇక తార్నాక, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి ఏరియాల్లో ఫార్మా అవశేషాలు 30 శాతం, ఆగ్రో కెమికల్ అవశేషాలు 12 వరకూ ఉన్నట్లు సైంటిస్టులు కనుగొన్నారు.  

టాయిలెట్ వ్యర్థాలూ ఉన్నయ్ 

సిటీ భూగర్బ జలాల్లో టాయిలెట్ వ్యర్థాల అవశేషాలు కూడా ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. ముఖ్యంగా నగరంలోని చాలా నివాస ప్రాంతాల నుంచి వచ్చేమురుగునీటిని సీవరేజ్​ట్రీట్​మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసి ఆ నీటిని  గార్డెనింగ్, టాయిలెట్లలో రోజువారి అవసరాలకు వినియోగిస్తుంటారు. చాలా సందర్భాలలో, పాక్షికంగా శుద్ధి చేసిన మురుగునీరు సరిగా ఫిల్టర్​కాకపోవడం, పైపులైన్ల లీకేజీల వల్ల మురుగునీరు భూమిలో చేరి భూగర్బ జలాలలను కలుషితం చేస్తున్నాయి. ఇలా చేరిన నీటిలో మనుషుల మూత్ర వ్యర్థాల ఆనవాళ్లు కూడా ఉన్నట్టు గుర్తించారు. మూత్ర వ్యర్థాలు అత్యధికంగా భరత్ నగర్ ఏరియాలో ఉన్నట్టు కనుగొన్నారు. బేగంపేట, తార్నాక, సనత్ నగర్, జూబ్లీహిల్స్, తిరుమలగిరి ఏరియాల్లో పౌల్ట్రీ వ్యర్థాల అవశేషాలు అధికంగా ఉన్నాయని సైంటిస్టులు పేర్కొన్నారు. 

ALSO READ : జనసేనకు 6 సీట్లు కన్ఫామ్.. మరో రెండు సీట్లు పెండింగ్​లో పెట్టిన బీజేపీ 

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం 

భూగర్బ జలాల కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఫార్మా వ్యర్థాలు, ఆగ్రో రసాయన వ్యర్థాల వల్ల భూగర్బ జలాల్లో నైట్రేట్స్, క్లోరైడ్ పెరుగుతాయి. ఆగ్రో కెమికల్స్ ప్రభావం వల్ల ఇటీవల చిన్న పిల్లల్లో బ్లూ బేబీ సిండ్రోమ్​అనే  వ్యాధి ప్రబలుతోంది. అలాగే నీటిలో సల్ఫర్ పరిమాణం అధికం కావడం వల్ల మనుషుల్లో గ్యాస్ట్రిక్ సమస్యలువస్తున్నాయి. వీటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఫార్మా కంపెనీలు, ఆగ్రో కెమికల్ కంపెనీలు వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో డంప్ చేయకుండా చూడాలి. రసాయన వ్యర్థాల్లోని కెమికల్స్ ను డీగ్రెడేషన్ చేయడం లేదా, తగిన రీతిలో దహనం చేయడం వంటి చర్యలు చేపట్టాలి.   
- డాక్టర్ విజయ్​కుమార్, జనరల్ ఫిజీషియన్, తార్నాక 

వెంటనే చర్యలు తీసుకోవాలి 

హైదరాబాద్ లో భూగర్భ జలాల కాలుష్యాన్ని తగ్గించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలి. మురుగునీటిని శుద్ధిచేసి ఇతర అవసరాలకు వినియోగించాలి. సీవరేజ్ ప్లాంట్లను మరింత మెరుగుపర్చాలి. విదేశాల్లో ఫార్మా కంపెనీలకు రూల్స్ స్ట్రిక్ట్ గా అమలు చేస్తారు. మన దేశంలో మాత్రం పెద్దగా పట్టించుకోవడంలేదు. ఫార్మా కంపెనీలు రసాయన వ్యర్థాలను జీరో పర్సెంట్ డిశ్చార్జ్ చేయాలి. కానీ చాలా ఖర్చు అవుతుందని కంపెనీలు బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను పారబోస్తున్నాయి. అవి వర్షాలు పడినప్పుడు భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయి. అలాగే ఇండస్ట్రీల నుంచి వ్యర్థాల విడుదలపైనా కఠిన చర్యలు తీసుకోవాలి.   

- ప్రొఫెసర్ పాండురంగారెడ్డి, ఓయూ