వీధి బాలలకు మంచి భవిష్యత్ ఇవ్వాలి: హైదరాబాద్​ కలెక్టర్​ అనుదీప్

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆపరేషన్ స్మైల్​లో బాల కార్మికులు, వీధి బాలలను గుర్తించి వారికి బంగారు భవిష్యత్​ఇవ్వాలని హైదరాబాద్ కలెక్టర్​ అనుదీప్ ​దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్​లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన స్థాయి కన్వర్జెన్స్ ఆన్ ఆపరేషన్ స్మైల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. వీధి బాలల ఆధార్, ఇతర డాక్యుమెంట్లు ఉంటే తీసుకోవాలన్నారు.

జిల్లాను 28 జోన్లుగా విభజించి ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 42 స్వచ్ఛంద సంస్థలు, ఆరు  ప్రభుత్వ హోమ్​లలో  2,224 మంది పిల్లలు సంరక్షణలో ఉన్నారని, ఇందులో 72 మందిని దత్తత ఇచ్చినట్లు కలెక్టర్ వివరించారు. సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ శైలజ, డీసీపీ లావణ్య, ఐసీడీఎస్ పీడీ అక్కేశ్వరరావు, జిల్లా కార్మిక శాఖ అధికారి  జాసన్, ఆర్డీవో రామకృష్ణ పాల్గొన్నారు.

రేషన్ కార్డుల సర్వే పారదర్శకంగా చేయాలి

రేషన్ కార్డుల జారీ కోసం నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను పారదర్శకంగా చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. మెహదీపట్నం మండలం విజయనగర్, హుమాయున్ నగర్ కాలనీల్లో సర్వేను శుక్రవారం  ఆయన పరిశీలించారు. సర్వేలో తప్పులు లేకుండా బాధ్యతతో నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.

అర్హులెవరూ మిస్​కావొద్దని, రిమార్కులు సరిగా రాయాలని సూచించారు. కార్యక్రమం లో జిల్లా పౌర సరఫరాల అధికారి రమేశ్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.