అవసరమైతే హాస్టళ్లలోనే నిద్రపోండి: హైదరాబాద్ కలెక్టర్

  • అధికారులకు హైదరాబాద్ ​కలెక్టర్​ అనుదీప్ ​ఆదేశం 
  • స్టూడెంట్ల సమస్యలు తెలుసుకోవాలని సూచన
  • ప్రతిరోజూ ప్రభుత్వ హాస్టళ్లను తనిఖీ చేయాల్సిందేనని స్పష్టం  
  • హాస్టళ్ల పర్యవేక్షణకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం

హైదరాబాద్, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లపై హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్​దురిశెట్టి స్పెషల్ ఫోకస్ పెట్టారు. హాస్టళ్లలోని వసతులు, శానిటేషన్, ఫుడ్ మెనూ, ఇతర సమస్యలు తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఆఫీసర్లను నియమించారు. ఎప్పటికప్పుడు హాస్టళ్లలోని పరిస్థితులపై తనకు రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. సీఎస్ ఆదేశాలతో కలెక్టర్​స్వయంగా హాస్టళ్లను తనిఖీ చేసి, పిల్లలతో మాట్లాడుతున్నారు. సమస్యలు తెలుసుకుంటున్నారు. అలాగే జిల్లాలోని వివిధ శాఖల అధికారులను స్పెషల్​ఆఫీసర్లుగా నియమించి తనిఖీ చేయిస్తున్నారు. అవసరమైతే రాత్రిళ్లు స్టూడెంట్లతో కలిసి హాస్టళ్లలో నిద్రపోవాలని, వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ‘ప్రతి అధికారి నిర్ణీత సమయం హాస్టల్​లో ఉండాలి. పిల్లలకు పెడుతున్న భోజన వివరాలు తెలుసుకోవాలి. 

మెనూ ప్రకారం ఇస్తున్నారా? లేదా? హాస్టల్​పరిసరాలు క్లీన్​గా ఉంటున్నాయా? లేదా? స్టాఫ్ అటెండెన్స్, రిజిస్టర్ అప్​డేట్ లో ఉంటున్నాయా లేదా?’ అనే వివరాలు తెలుసుకోవాలని చెప్పినట్లు సమాచారం. ఇప్పటివరకు బీసీ హాస్టళ్లలో మాత్రమే తనిఖీలు కొనసాగగా, తాజాగా ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ, రెసిడెన్షియల్​హాస్టళ్ల బాధ్యతలను కూడా అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లను తనిఖీ చేయడానికి కలెక్టర్​స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. వారంతా ఎప్పటికప్పుడు స్కూళ్లను విజిట్​చేసి ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పనుల పురోగతి, సమస్యలపై కలెక్టర్​కు నివేదిక ఇస్తున్నారు.

ఇప్పటికైతే ఆరుగురు.. ఇంకా పెరిగే చాన్స్

వెల్ఫేర్ హాస్టళ్లను తనిఖీ చేయడానికి కలెక్టర్​ఆరుగురు స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. జిల్లా చీఫ్​ప్లానింగ్​ఆఫీసర్​ సురేందర్, జీఎండీఐసీ పవన్ కుమార్, డీఎస్​సీడీఓ పెరిక యాదయ్య, డీటీడీఓ కోటాజీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్, డీబీసీడీఓ ఆశన్నకు తనిఖీల బాధ్యతలు అప్పగించారు. ఒక్కో అధికారికి బీసీ 10 హాస్టళ్లను కేటాయించారు. త్వరలో ఎస్టీ హాస్టళ్లను తనిఖీ చేసి రిపోర్టు అందించాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆరుగురు అధికారులకు అదనంగా రెండు ఎస్టీ హాస్టళ్లను తనిఖీ చేసే బాధ్యత అప్పగించినట్లు సమాచారం. త్వరలో మరికొంత మందిని స్పెషల్​ఆఫీసర్లుగా నియమించనున్నట్లు తెలుస్తోంది. 

కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. 

చదువుతోపాటు క్రీడల్లో రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకొని రావాలని కలెక్టర్ అనుదీప్ స్టూడెంట్లకు సూచించారు. శనివారం ఆయన బోయిన్ పల్లి బాపూజీనగర్ ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీ హాస్టల్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి వంటగది, స్టోర్ రూమ్, కంప్యూటర్ ల్యాబ్, స్టూడెంట్ల రూమ్స్, అటెండెన్స్​రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్, స్టాక్ నిల్వలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. 5వ తరగతి గదిని సందర్శించి,  విద్యార్థులతో ఇంగ్లీష్, తెలుగు పాఠ్య పుస్తకాలు చదివించారు. జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఆర్.కోటాజి, సికింద్రాబాద్ ఆర్డీఓ దశరథ్ సింగ్, హాస్టల్​సంక్షేమ అధికారి ఎం.నీలిమ, తహసీల్దార్ ఎస్.అశోక్ కుమార్, హెచ్ఎం అనిత తదితరులు పాల్గొన్నారు.