హైదరాబాద్, వెలుగు : జిల్లాలోని స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రోపియట్ అథారిటీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి స్కానింగ్ సెంటర్ ను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీ చేయాలని, ఫారం-–ఎఫ్ లను తప్పనిసరిగా చెక్ చేయాలని ఆదేశించారు. అనుమానం ఉన్న సెంటర్లపై డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి, కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. భ్రూణ హత్యలను నివారించి, జిల్లాలో బాలికల నిష్పత్తి పెరిగేలా చూడాలన్నారు. సమావేశంలో హైదరాబాద్ మూడో మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి ఎ.కుమారస్వామి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి, అడిషనల్ డీసీపీ జి మనోహర్, డాక్టర్ జయమాలిని, ఎంసీహెచ్ ప్రోగ్రాం ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ, డీఈఓ, డిప్యూటీ డీఓలు, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలతో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులపై సమీక్ష నిర్వహించారు. నాణ్యత ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడొద్దని సూచించారు. అడిషనల్కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, టీఎస్ ఈడబ్ల్యూ ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ షఫీ మియా, జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కోఆర్డినేటర్ రజిత తదితరులు పాల్గొన్నారు.