
- ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పండి
- మెట్రో అధికారులను కోరిన హైదరాబాద్ కలెక్టర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: మెట్రో రైలు శబ్దాలతో ఇబ్బందులు పడుతున్నామని బోయిగూడ వాసులు చేసిన ఫిర్యాదుపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పందించారు. విచారణ జరిపాలని మెట్రో అధికారులను కోరారు. శబ్దాల నియంత్రణకు ఇప్పటివరకు ఏమేమి చర్యలు తీసుకున్నారో తెలియచేయాలన్నారు. బోయిగూడ జంక్షన్ పిల్లర్ నెంబర్ బి.1006 వద్ద మెట్రో రైల్ ట్రాక్ సౌండ్స్ 80 డెసిబల్స్ నమోదవుతున్నదని, సౌండ్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఎన్.ఎన్.కె.విట్టల్ అపార్ట్మెంట్ వాసులు పలుమార్లు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.
జనవరిలో ప్రజావాణిలో మెట్రో శబ్దాలపై ఫిర్యాదు చేయగా, మెట్రో అధికారులు అమెరికన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్టు లెక్కలు చూపుతూ రిప్లై ఇచ్చారని, అమెరికన్ లెక్కలకు ఇండియా మెట్రోకు సంబంధం ఏమిటని రెసిడెంట్స్ ప్రశ్నిస్తున్నారు. మెట్రో అధికారుల రిప్లయ్చూడకుండానే గ్రీవెన్స్ సెల్ అధికారులు కంప్లైంట్ ను క్లోజ్ చేశారని రెసిడెంట్స్ మండిపడుతున్నారు. కనీసం కలెక్టర్ ఆదేశాలతోనైనా తమ సమస్య పరిష్కారమవుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఇటీవల స్థానికులు సీఎంఓలో ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్ కలెక్టర్ కు ఆదేశాలు వచ్చాయి.