
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రతి ఒక్క హాస్పిటల్, క్లినిక్, థెరపీ సెంటర్ చట్టాలు తప్పనిసరిగా ఫాలో కావాలని, తమకు తెలియదంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హైదరాబాద్కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. మంగళవారం సికింద్రాబాద్ హరిహర కళాభవన్ లో ప్రైవేట్ హాస్పిటల్స్, అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఫిజియోథెరపీ, ఎక్స్‌రే, స్పీచ్ థెరపీ, ఆయుష్ క్లినిక్స్, మెడికల్ డైరెక్టర్లు, క్లినిక్స్ ఓనర్లకు ..వైద్యానికి సంబంధించిన చట్టాలపై ఓరియెంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ కింద ప్రతిఒక్క హాస్పిటల్, క్లినిక్ రిజిస్టర్ చేసుకోవాలన్నారు.
అన్ని ప్రైవేటు హాస్పిటల్స్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌లో రిజిస్టర్ కావాలని, సిబ్బంది వివరాలు నమోదు చేయాలని, లేదంటే యాక్షన్ తప్పదన్నారు. చట్టాలకు సంబంధించిన వివరాల బుక్ ఆవిష్కరించారు. వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ బి. రవీంద్ర నాయక్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉద్దేశ్యం, నిబంధనలను వివరించారు. సిటీలో చాలా మంది డాక్టర్లు, క్లినిక్ ఓనర్లకు చట్టాలపై అవగాహన లేదని తమ దృష్టికి వచ్చిందని, వారి కోసమే అవేర్నెస్ సమావేశాన్ని ఏర్పాటు చేశామని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి అన్నారు.
ఆటిజం స్టోరీపై కలెక్టర్ స్పందన
ఈ నెల 15న వెలుగు దినపత్రికలో ‘ఆటిజం పేరుతో అడ్డగోలు దోపిడి’ అనే హెడ్డింగ్ పబ్లిష్ అయిన స్టోరీపై కలెక్టర్ స్పందించి మాట్లాడారు. ‘ఇటీవలే ఆటిజం ట్రీట్మెంట్ పేరుతో ఒక్కో సెషన్‌కు వేలల్లో దండుకుంటున్నారని వెలుగులో ఒక ఆర్టికల్చదివా. అలా డబ్బులు దండుకునే సెంటర్లలో సరైన ట్రీట్మెంట్ అందిస్తారా లేదా అనేది కూడా అనుమానమేనా.. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. అలాంటి సెంటర్లకు పిల్లల్ని తీసుకెళ్లొద్దు’ అని సూచించారు. ఆటిజం సెంటర్లన్నీ రిజిస్టర్ చేసుకోవాలన్నారు.