వారంలో అన్నీ మారాలి.. హాస్టళ్లు, రెసిడెన్షియల్​ స్కూళ్ల పరిస్థితిపై కలెక్టర్​ సీరియస్​

వారంలో అన్నీ మారాలి.. హాస్టళ్లు, రెసిడెన్షియల్​ స్కూళ్ల పరిస్థితిపై కలెక్టర్​ సీరియస్​
  • పరిశీలించి రిపోర్ట్​ ఇచ్చిన స్పెషల్​ ఆఫీసర్లు 
  • నివేదిక ఆధారంగా 45 మంది వార్డెన్లకు షోకాజ్ నోటీసులు​  
  •  పరిస్థితి మారకుంటే యాక్షన్ ​తప్పదని గట్టి వార్నింగ్

హైదరాబాద్ సిటీ, వెలుగు:హాస్టళ్లలో శానిటేషన్​ నిర్వహణలో విఫలం కావడం, స్టూడెంట్స్​కు క్వాలిటీ ఫుడ్​ అందించకపోవడంపై సీరియస్​ అయిన హైదరాబాద్ కలెక్టర్​అనుదీప్​ 45 మంది హాస్టల్​ వార్డెన్లకు షోకాజ్​ నోటీసులు జారీ చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలి ఆదేశించారు. జిల్లాలో ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్​ అన్నీ కలిపి160 హాస్టళ్లున్నాయి. ఇందులో 14 ఎస్టీ వెల్ఫేర్ ​హాస్టళ్లుండగా, 10 హాస్టళ్లకు చెందిన వార్డెన్లకు షోకాజ్​నోటీసులు ఇచ్చారు.

వీరితో పాటు మరో 18 మంది బీసీ హాస్టళ్ల వార్డెన్లకు, ఏడుగురు మైనారిటీ హాస్టళ్ల వార్డెన్లకు నోటీసులు వెళ్లాయి. వారంలో హాస్టల్స్, రెసిడెన్షియల్​ స్కూళ్లలో సమస్యలు పరిష్కరించాలని, పిల్లలకు మెనూ ప్రకారం క్వాలిటీ ఫుడ్ ​పెట్టాలని, లేకపోతే యాక్షన్​తప్పదని, సస్పెన్షన్​కు కూడా వెనకాడబోమని కలెక్టర్ ​హెచ్చరించినట్టు సమాచారం. 

75 మార్కులకంటే తక్కువ వచ్చినవారికే...

రాష్ట్రమంతటా హాస్టళ్లు, రెసిడెన్షియల్ ​స్కూళ్లలో ఫుడ్​ పాయిజన్​ఘటనలు చోటుచేసుకుంటుండడంతో జిల్లాలో హాస్టల్స్​, రెసిడెన్షియల్ ​స్కూళ్లలో తనిఖీ చేయడానికి కలెక్టర్​అనుదీప్  80 మంది స్పెషల్​ ఆఫీసర్లను నియమించారు. వీరు రోజూ రెండు హాస్టళ్లను విజిట్ చేసి అక్కడి వసతులు, క్వాలిటీ ఫుడ్​పెడుతున్నారా లేదా? టాయిలెట్స్​ నిర్వహణ ఎలా ఉంది? లాంటి విషయాలను పరిశీలించారు. మొత్తంగా 100 మార్కులు పెట్టుకుని వారి పరిశీలనలో వచ్చిన మార్కులను వేసి కలెక్టర్​కు రిపోర్ట్​ ఇచ్చారు.

ఈ నివేదికలో 75 మార్కులకంటే తక్కువ వచ్చిన హాస్టల్​ వార్డెన్లకు కలెక్టర్​ షోకాజ్​నోటీసులిచ్చారు.  ఈ స్పెషల్ అధికారుల తనిఖీలు మరో మూడు వారాల పాటు కొనసాగుతాయని, తర్వాత హాస్టళ్ల తనిఖీకి పర్మినెంట్ గా ఒక టీమ్​ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ ​తెలిపారు.

నాసిరకం ఫుడ్​ ఐటమ్స్

హాస్టళ్ల తనిఖీకి ఏర్పాటు చేసిన టీమ్స్​లో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లు ఉన్నారు. వీరు జిల్లాలోని చాలా హాస్టళ్లను తనిఖీ చేసి  పెరిగిన డైట్​ చార్జీల ప్రకారం నాణ్యమైన ఫుడ్​ పెట్టడం లేదని, నాణ్యతలేని పప్పు, నూనెలు, ఇతర ఫుడ్​ఐటమ్స్​వాడుతున్నట్టు గుర్తించారు. డైనింగ్, కిచెన్​ఏరియాలు, టాయిలెట్స్​ అపరిశుభ్రంగా ఉన్నాయని, టాయిలెట్స్​కు డోర్స్​సరిగ్గా లేవని తేల్చారు.

కొన్ని హాస్టళ్లలో రిజిస్టర్లు సరిగ్గా మెయింటెయిన్​చేయడం లేదని, వాటర్​ ట్యాంకులు పరిశుభ్రంగా ఉన్నాయని తెలుసుకున్నారు. హాస్టళ్లలోనే భోజనం చేసి నాణ్యతను పరిశీలిస్తున్నారు.