- రాష్ట్రంలో తొలిసారిగా వినూత్న ప్రోగ్రామ్ షురూ
- హైదరాబాద్ జిల్లాలో మొదలుపెట్టిన కలెక్టర్ అనుదీప్
హైదరాబాద్,వెలుగు: సర్కారు బడుల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు.. టీచర్లలో నూతనోత్సాహం నింపేందుకు ‘ కాఫీ విత్ కలెక్టర్ ’ ప్రోగ్రామ్ నిర్వహించనున్నట్టు హైదరాబాద్ కలెకర్ట్ అనుదీప్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఎఫ్ఎల్ఎస్ యాప్ లో 200 మంది స్టూడెండ్ల అటెండెన్స్ పర్సంటేజ్ పెంచిన10 పాఠశాలల హెడ్ మాస్టర్లను పిలిపించారు. ప్రోగ్రామ్ లో కలెక్టర్ పాటు డీఈవో ఆర్.రోహిణి పాల్గొని కాఫీ తాగారు.
రాష్ట్రంలో తొలిసారిగా ‘ కాఫీ విత్ కలెక్టర్ ’ వినూత్న ప్రోగ్రామ్ మొదలుపెట్టినట్టు కలెక్టర్ తెలిపారు. విద్యార్థుల హాజరు శాతం పెంపుతో పాటు టీచర్లో పోటీతత్వం ఏర్పడి విద్యా ప్రమాణాలు మెరుగు పడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ జీవీ గుప్తా, హెడ్ మాస్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
‘ డ్రగ్స్ ఫ్రీ ఇండియా డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ’ చేద్దాం
మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ అనుదీప్, డిజేబుల్ వెల్ఫేర్ డైరెక్టర్ బి. శైలజ సూచించారు. గోల్కొండ ప్రభుత్వ బాలుర ఉర్దూ మీడియం హై స్కూల్ లో నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్ లో పాల్గొని విద్యార్థులతో ‘ డ్రగ్స్ ఫ్రీ ఇండియా – డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ’ ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ వాడకం జరగకుండా నిఘా పెట్టాలని పేర్కొన్నారు. ఎవరైనా వినియోగిస్తే వెంటనే సంబంధిత ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. కొవిడ్ మహమ్మారిని తరిమికొట్టినట్లే మాదకద్రవ్యాలను పారదోలాలని ఆయన పిలుపునిచ్చారు.