- రహస్యంగా వీడియోలు తీసిన ఘటనపై స్టూడెంట్ల ఫైర్
- విచారణ చేపట్టిన పోలీసులు.. అదుపులో ఏడుగురు
- బాత్రూం వెంటిలేటర్‌పై చేతి వేళ్ల ముద్రలు సేకరణ
- కాలేజీ మేనేజ్మెంట్కు మహిళా కమిషన్ నోటీసులు
మేడ్చల్, వెలుగు: మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ (సీఎంఆర్ ఐటీ) గర్ల్స్ హాస్టల్ వద్ద గురువారం హైటెన్షన్ నెలకొంది. రహస్యంగా వీడియోలు తీసిన ఘటనపై స్టూడెంట్లు ఆందోళన కొనసాగించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ఆందోళనలతో కాలేజీ అట్టుడికింది. బుధవారం రాత్రి నుంచి ఆందోళనలు కొనసాగడంతో యాజమాన్యం ఎట్టకేలకు దిగొచ్చింది. దీనిపై నిజనిర్ధారణ కమిటీ వేస్తున్నట్టు ప్రకటించింది. తాము హాస్టల్ బాత్రూంలో ఉండగా, రహస్యంగా వీడియోలు తీశారని విద్యార్థులు బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు.
వీరి ఆందోళనకు ఎన్ఎస్‌యూఐ, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, బీజేవైఎం సంఘాలు మద్దతు పలికాయి. స్టూడెంట్స్ఆందోళన గురువారం కూడా కొనసాగింది. విషయం తెలుసుకుని విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు చేరుకున్నారు. తల్లిదండ్రులను చూడగానే విద్యార్థులు బోరున విలపించారు. మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి హాస్టల్‌కు చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. దర్యాప్తు చేస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆందోళన విరమించాలని కోరారు. కాగా, హాస్టల్ లో వంట పనిచేసే ఐదుగురిని బుధవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గురువారం హాస్టల్ మెస్ ఇన్చార్జ్ సెల్వం, హాస్టల్ వార్డెన్ ప్రీతిరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బాత్రూం వెంటిలేటర్ పై ఉన్న చేతి ముద్రలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.
అసలేం జరిగిందంటే?
డిసెంబర్ 31న రాత్రి న్యూఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్న విద్యార్థులు వాష్ రూమ్ కు వెళ్లారు. అదే సమయంలో బాత్రూం కిటికీ వద్ద ఏదో నీడ కనిపించింది. బాత్రూం కిటికీపై ఫింగర్ ప్రింట్స్ కనిపించడంతో ఎవరో వచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై హాస్టల్ వార్డెన్ ప్రీతిరెడ్డికి సమాచారం ఇవ్వగా, ఆమె అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు. పైగా ‘గొడవ చేస్తే నిజంగానే మీ వీడియోలు బయటపెడతాను’ అని ఆమె బెదిరించారని విద్యార్థులు ఆరోపించారు. దీంతో ఈ విషయాన్ని విద్యార్థి సంఘాల లీడర్లకు చెప్పడంతో వారు ఆందోళనకు దిగారు. హాస్టల్ బాత్రూం పక్కనే పనివాళ్ల రూమ్ ఉన్నదని, వాళ్లే వీడియోలు తీసి ఉంటారని విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బుధవారం రాత్రి వార్డెన్ ను ఓ వ్యక్తి రహస్యంగా హాస్టల్ నుంచి బయటకు పంపించిన వీడియోలు వైరల్ అయ్యాయి. వార్డెన్ తప్పు చేయకపోతే అర్ధరాత్రి హాస్టల్ నుంచి పారిపోవాల్సిన అవసరం ఏంటి? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
మహిళా కమిషన్ విచారణ..
ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్సుమోటోగా విచారణ చేపట్టింది. దీనిపై తక్షణమే నివేదిక అందజేయాలని సైబరాబాద్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. మరోవైపు మహిళా కమిషన్ సెక్రటరీ పద్మజ రమణి కాలేజీకి వచ్చి పరిశీలించారు. మేనేజ్మెంట్నుంచి రాత పూర్వక వివరణ తీసుకున్నారు. కాలేజీకి నోటీసులు అందజేశారు. అన్ని ఆధారాలు సేకరించి కమిషన్ కు అందజేస్తానని పద్మజ రమణి తెలిపారు.
ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఫోన్లు: ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి
ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. హాస్టల్ పరిసరాలను పరిశీలించామని చెప్పారు. ‘‘స్నానం చేస్తున్నప్పుడు బాత్రూం వెనుక భాగంలో వ్యక్తులు తిరుగుతున్నట్లు గమనించామని విద్యార్థులు చెప్పారు. మహిళా పోలీసులతో బాత్రూం దగ్గర చెక్ చేయించాం. వెంటిలేటర్‌పై ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ లభించాయి. మెస్‌లో పనిచేసే వ్యక్తులు మాత్రమే లోపలికి వచ్చే చాన్స్ ఉంది. అనుమానితులకు సంబంధించినవి 12 సెల్‌ఫోన్లు సీజ్ చేశాం. వాటిలో ఎలాంటి వీడియోలు , ఫొటోలు లేవు. ఒకవేళ డిలీట్ చేసి ఉండొచ్చు. అది తెలుసుకునేందుకు ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాం. ఈ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. విద్యార్థుల స్టేట్‌మెంట్ రికార్డ్ చేశాం” అని వెల్లడించారు.
వార్డెన్‌ను టర్మినేట్ చేశాం: ప్రిన్సిపాల్
పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తామని కాలేజీ ప్రిన్సిపాల్ నారాయణ తెలిపారు. పోలీసులకు సీసీ పుటేజీ అందజేశామని చెప్పారు. హాస్టల్ వార్డెన్‌ని టర్మినెట్ చేయాలని బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు విద్యార్థులు కంప్లయింట్చేశారని, వాళ్ల డిమాండ్ మేరకు టర్మినేట్ చేశామని వెల్లడించారు. ఐదుగురు సీనియర్ మహిళా సిబ్బందితో నిజనిర్ధారణ కమిటీ వేశామన్నారు. నిందితులెవరైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.