- కట్టాలంటే భయపడే పరిస్థితి తెస్తం
- అక్రమ నిర్మాణలకు అడ్డుకట్ట వేసం
- హైడ్రాకోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్
- గొలుసుకట్టు చెరువులన్నీ పునరుద్ధరిస్తం
- పార్కు జాగాల పరిరక్షణకు కాలనీ సంఘాలు
- హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడి
హైదరాబాద్: రాజధాని నగరంలో ఆక్రమణలు, కబ్జాలపై కొరడా ఝుళిపించనున్నట్టు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) కమిషనర్ రంగనాథ్ చెప్పారు. బఫర్ జోన్ లో జాగాలు కొనొద్దు, నిర్మాణాలు చేపట్టవద్దని అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో దశల వారీగా హైడ్రా పనిచేస్తుందని రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. మొదటి దశలో ఆక్రమణలను అడ్డుకుంటామన్నారు. రెండో దశలో ఆక్రమించి నిర్మించిన భవనాలపై చర్యలు, అనుమతుల నిరాకరణ ఉంటుందని తెలిపారు. మూడో దశలో చెరువుల పూడిక తీసి వాన నీటిని మళ్లించి పునరుజ్జీవం కల్పిస్తామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 400 చెరువులు, కుంటలు ఉన్నాయని చెప్పారు. ఎన్‌ఆర్‌ఎస్‌సీ నివేదిక ప్రకారం 44 ఏళ్లలో చాలా చెరువులు కనుమరుగయ్యాయని చెప్పారు. ఎక్కువ భాగం చెరువులు 60%, కొన్ని 80% ఆక్రమణలకు గురయ్యాయని చెప్పారు. ప్రస్తుతం చెరువుల పరిధిలోని ఆక్రమణలను గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిని అడ్డుకోకపోతే హైదరాబాద్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. త్వరలో హైడ్రాకు ప్రభుత్వం పెద్దఎత్తున సిబ్బందిని సమకూరుస్తుందని వివరించారు.
ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్
హైడ్రాకు త్వరలోనే ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటవుతుందని రంగనాథ్ చెప్పారు. 2,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైడ్రా పరిధి ఉందన్నారు. గొలుసుకట్టు చెరువులన్నీ పునరుద్ధరిస్తామని చెప్పారు. చెరువులకు నీటిని మళ్లించే నాలాలు పూడుకుపోయాయన్నారు. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఎవరూ స్థలాలు కొనుగోలు చేయవద్దని తెలిపారు. చెరువుల పరిరక్షణకు అందరితో కలిసి మేథోమథనం చేస్తామని తెలిపారు. పార్కు స్థలాలు పరిరక్షించే కాలనీ సంఘాలను సమర్థిస్తామని తెలిపారు. నందగిరి హిల్స్ సొసైటీతో తమకు ఎలాంటి ఒప్పందం లేదన్నారు. చందానగర్‌లో గతేడాది బఫర్ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులిచ్చారని, ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తే చర్యలు తప్పవని రంగనాథ్ హెచ్చరించారు. బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టాలంటేనే భయపడే స్థితికి తీసుకొస్తామని రంగనాథ్ తెలిపారు.