స్పేడెక్స్ మిషన్లో హైదరాబాద్ కంపెనీ.. శాటిలైట్లు, రాకెట్కు కీలక భాగాలు సప్లై చేసిన అనంత్ టెక్నాలజీస్

హైదరాబాద్, వెలుగు: స్పేడెక్స్ శాటిలైట్ డాకింగ్​తో ఇస్రో సృష్టించిన సరికొత్త చరిత్రలో హైదరాబాద్​కు చెందిన సంస్థ ఘనత కూడా ఉంది. హైదరాబాద్​కు చెందిన అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఏటీఎల్) అనే సంస్థ.. స్పేడెక్స్ శాటిలైట్లలో కీలక భాగాలు తయారు చేసింది. స్పేడెక్స్ 01, స్పేడెక్స్ 02 శాటిలైట్లలో రెండెవూ ప్రాసెసింగ్ యూనిట్స్ (ఆర్పీయూ- రెండు శాటిలైట్లను అనుసంధానించే యూనిట్లు), డీసీ–డీసీ కన్వర్టర్లను తయారు చేసి ఇచ్చింది.

ఉప గ్రహాలకు సంబంధించి అసెంబ్లీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ (ఏఐటీ)నూ కూడా హైదరాబాద్ లోని అత్యాధునిక శాటిలైట్ కేంద్రాల్లో తయారు చేసింది. స్పేడెక్స్ శాటిలైట్లకే కాకుండా ఇస్రో రేసు గుర్రమైన పీఎస్​ఎల్​వీ–సీ60 రాకెట్ సబ్ అసెంబ్లీ విడిభాగాలనూ ఏటీఎల్ సంస్థ సప్లై చేసింది. డేటా ఆక్విజిషన్ యూనిట్లు, ట్రాన్స్​మీటర్లు, పవర్ మాడ్యూల్స్, నావిక్ ప్రాసెసర్, కంట్రోల్ మాడ్యూల్స్​ను ఇస్రోకు సరఫరా చేసింది.

ఇస్రో విజయాల్లో కీలక పాత్ర
ఇస్రోతో ఏటీఎల్ సంస్థకు దాదాపు 30 ఏండ్ల బంధం ఉంది. ఇప్పటిదాకా 102 శాటిలైట్లు, 82 రాకెట్ ప్రయోగ విజయాల్లో ఈ సంస్థ కీలక పాత్ర పోషించింది. కీలకమైన సాంకేతిక వ్యవస్థలను రూపొందించడంతో పాటు శాటిలైట్ సిస్టమ్స్, రాకెట్ భాగాలను తయారు చేసి ఇస్రోకు సరఫరా చేసింది. అలాగే, హిందూస్థాన్​ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్​), భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) వంటి ప్రభుత్వ రంగ సంస్థలకూ ఏటీఎల్ పలు కీలక టెక్నాలజీలను అందిస్తున్నది. కాగా, స్పేడెక్స్ మిషన్​లో కీలకపాత్ర పోషించడం గర్వంగా ఉందని ఆ సంస్థ చైర్మన్, ఎండీ పి.సుబ్బారావు అన్నారు.