ఫ్లిప్​కార్ట్, లెనోవాకు కన్జ్యూమర్ ​ఫోరం షాక్​

ఫ్లిప్​కార్ట్, లెనోవాకు కన్జ్యూమర్ ​ఫోరం షాక్​
  • కస్టమర్ రిక్వెస్ట్​ను పట్టించుకోనందుకు నష్టపరిహారం విధింపు

హైదరాబాద్ సిటీ, వెలుగు: కస్టమర్ విజ్ఞప్తి మేరకు డ్యామేజ్ అయిన ల్యాప్ టాప్ ను రిటర్న్​ తీసుకోకుండా వేధించిన ఫ్లిప్ కార్ట్, లెనోవా కంపెనీ, ల్యాప్ డిస్ట్రిబ్యూటర్స్​కు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-–1 షాక్ ఇచ్చింది.  బాధితునికి ల్యాప్​ట్యాప్​ధర రూ.18,450 లను 6 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని, లేకుంటే నెల రోజుల్లో కొత్త ల్యాప్ ​ట్యాప్ ​ఇవ్వాలని, అదనంగా రూ.30 వేలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. కుత్బుల్లాపూర్ కు చెందిన బండి నరేశ్ కుమార్.. ఫ్లిప్ కార్ట్ లో ల్యాప్​ట్యాప్​బుక్​చేసుకోగా 2023 నవంబర్ 10వ తేదీన లెనోవా ల్యాప్ టాప్ తో కూడిన పార్సిల్ వచ్చింది. 

12వ తేదీన ఓపెన్ చేసి చూడగా ల్యాప్ టాప్  స్క్రీన్ పై లైన్స్ వస్తున్నాయని గ్రహించి రిటర్న్ చేశాడు. కానీ కంపెనీ రిటర్న్ తీసుకోలేదు. అలా బాధితుడు పలుమార్లు రిటర్న్ రిక్వెస్ట్ పెట్టినా రిజెక్ట్ చేశారు. విసిగిపోయిన నరేశ్​ హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-–1 లో ఫిర్యాదు చేశాడు. ఇరువైపులా వాదనలు విన్న ఫోరమ్.. అకారణంగా కస్టమర్ ను ఇబ్బందికి గురి చేసినందుకు లాప్​ట్యాప్​ధర రూ. 18,450లను 6శాతం వడ్డీతో చెల్లించాలని లేదా నెలరోజుల్లో కొత్త ల్యాప్​ట్యాప్​ ఇవ్వాలని ఆదేశించింది. వీటితో పాటు రూ.30 వేలు నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది.