చైనా మాంజా అమ్మితే..ఐదేండ్లు జైలు..లక్ష జరిమానా

చైనా మాంజా అమ్మితే..ఐదేండ్లు జైలు..లక్ష జరిమానా

హైదరాబాద్ సిటీ, వెలుగు: చైనా మాంజా అమ్మితే ఐదేండ్ల జైలు శిక్షతో పాటు, లక్ష రూపాయల జరిమానా విధిస్తామని టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఇటీవల సిటీలో జరిపిన సోదాల్లో 15 లక్షల విలువైన 1,500 చైనీస్ మాంజాలను సీజ్ చేశామని ఆయన తెలిపారు. అలాగే, గురువారం జరిపిన తనిఖీల్లో 12 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. 2024 లో 37 లక్షల విలువ గల చైనీస్ మాంజాలను స్వాధీనం చేసుకున్నామని శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. లంగర్ హౌస్ పరిధిలో బైక్ పై వెళ్తున్న ఒక ఆర్మీ జవాను చైనా మాంజా గొంతుకు చుట్టుకొని చనిపోయాడని.. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగొద్దని సిటీలోని పతంగుల షాపుల్లో తనిఖీలు జరుపుతున్నామని డీసీపీ వెల్లడించారు. 

ALSO READ : కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి మహిళ సూసైడ్!

ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ లో చైనీస్ మాంజాను నిషేధించారని, చైనీస్ మాంజా హ్యూమన్ సేఫ్టీకి ప్రమాదకరమని తెలిపారు. నిషేధించిన చైనా మాంజాను ప్రజలు వినియోగించద్దని సూచించారు. నిబంధనలు పాటించని విక్రయదారులకు ఎన్విరాన్ మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, సెక్షన్ 15 ప్రకారం ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు, లక్ష రూపాయలు జరిమానా విధించే అవకాశం ఉంటుందని తెలిపారు. చైనా మాంజా వల్ల పక్షులు, మనుషులు, పర్యావరణానికి ఇబ్బందులు కలుగుతున్నాయని, ప్రమాదాలు జరిగి ప్రాణాలు సైతం పోతున్నాయని చెప్పారు. దేశీయంగా తయారు చేసే మాంజా కూడా మార్కెట్లో అందుబాటులో ఉందని, చైనీస్ మాంజా కు బదులు దేశీయ మాంజాను వినియోగించాలని డీసీపీ సూచించారు. చైనీస్ మాంజాను ఎవరైనా విక్రయిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. చైనా మాంజా తనిఖీలపై స్పెషల్ డ్రైవ్ నిత్యం జరుగుతూనే ఉంటుందని తెలిపారు.--- కొంతమంది సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా చైనీస్ మాంజాను తెప్పించుకుంటున్నారని.. ఢిల్లీ, బాంబే, గుజరాత్ నుంచి హైదరాబాద్ కు మాంజాలు వస్తున్నట్టు తమకు సమాచారం ఉందని డీసీపీ తెలిపారు.