డీజే చప్పుళ్లతో గుండెలు అదురుతున్నయని ఆందోళన: సీపీ సీవీ ఆనంద్

డీజే చప్పుళ్లతో గుండెలు అదురుతున్నయని ఆందోళన: సీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్: ఈ ఏడాది జరిగిన గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ర్యాలీలో డీజే చప్పుళ్లు శృతి మించాయని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. మతపరమైన ర్యాలీల్లో డీజే, టపాసుల వాడకంపై కమాండ్ కంట్రోల్ సెంటర్‎లో ఇవాళ (సెప్టెంబర్ 26) సీవీ ఆనంద్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ అధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంఐఎం ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల ప్రతినిధులు, మత సంఘాలు నేతల హాజరైన ఈ సమావేశంలో మతపరమైన ర్యాలీల్లో డీజే, టపాసుల వాడకంపై చర్చించారు. 

అనంతరం సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. డీజే శబ్దాల మీద అనేక ఫిర్యాదులు వస్తున్నాయని.. మితిమీరిన సౌండ్ వల్ల వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని.. గుండె అదురుతుందని వారు ఆందోళన చెందుతున్నారన్నారని అన్నారు. ఈసారి వినాయక నిమిజ్జనం, మిలాద్ ఉన్ నబీ ర్యాలీల్లో డీజే సౌండ్స్ శృతిమించాని.. డీజే నృత్యాలు విపరీతం అయ్యాయని తెలిపారు.  

పబ్‎లో డ్యాన్సులు చేసినట్లే ర్యాలీల్లో చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. డీజే శబ్దాలు కట్టడి చేయాలని అనేక సంఘాలు విజ్ఞప్తి చేశాయని.. అందుకే ఇవాళ పలు వర్గాలను పిలిచి మాట్లాడామని పేర్కొ్న్నారు. అందరి అభిప్రాయం తీసుకుని డీజేలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని, తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. డీజే శబ్దాలపై కంట్రోల్ లేకపోతే ఆరోగ్యాలు దెబ్బ తింటాయని ఆందోళన వ్యక్తం చేశారు.