హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో అరెస్టుల సంఖ్య వంద దాటవచ్చని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్ చెప్పారు. ఈ కేసులో విచారణ వేగంగా కొనసాగుతోందని తెలిపారు. కొందరు అభ్యర్థులు ఎలక్ర్టానిక్ డివైస్‌లను ఉపయోగించుకుని పరీక్షలు రాసినట్టుగా దర్యాప్తులో తేలిందన్నారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్‌లో మంగళవారం (మే 30) మీడియాతో మాట్లాడారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోంది.ఇప్పటి వరకు సిట్ టీఎస్‌పీఎస్సీ పరీక్షల్లో టాప్ స్కోర్ చేసిన 100 మందిని ప్రశ్నించింది. పలువురు అనుమానితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారించిన సిట్.. ఇప్పటికే 49 మందిని అరెస్టు చేసింది.
పేపర్ లీకేజీ కోసం కొందరు లెటెస్ట్ టెక్నాలజీని కూడా ఉపయోగించినట్లు దర్యాప్తులో అధికారులు గుర్తించారు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతున్న వేగాన్ని బట్టి చూస్తే.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్టయిన వారి సంఖ్య త్వరలో 100కు చేరే అవకాశం ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.
టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్, కమిషన్ సభ్యులు బి. లింగారెడ్డిలను కూడా ఇప్పటికే సిట్ విచారించింది. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా విచారణ జరుపుతోంది. టీఎస్‌పీఎస్సీ ఉన్నతాధికారుల వాంగ్మూలాలను కూడా నమోదు చేసింది.
బోర్డులోని కాన్ఫిడెన్షియల్ రూం నుంచి ఈ ప్రశ్నాపత్రాలను లీక్‌చేసిన ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డిల చేతుల్లో నుంచి వేర్వేరు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయన్నారు సీవీ ఆనంద్. డబ్బు పెట్టి ప్రశ్నాపత్రాలు కొన్నవారు తాము చెల్లించిన నగదును తిరిగి సంపాదించుకునేందుకు మరికొంత మందికి ప్రశ్నాపత్రాలను అమ్మినట్టుగా తెలిపారు. ఈ కేసులో పాత్ర ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని స్పష్టం చేశారు.