హైదరాబాద్: గణేష్ చతుర్థి రోజే హైదరాబాద్ సీపీగా తిరిగి రావడం సంతోషంగా ఉందని.. గణనాథుడి అనుగ్రహంతోనే నేను మళ్ళీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా వచ్చానని అనుకుంటున్నానని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. హైదరాబాద్ సీపీగా మళ్ళీ తిరిగి వస్తానని అనుకోలేదన్నారు. మంగళవారం ఖైరతాబాద్ వినాయకుడిని సీపీ సీవీ ఆనంద్ దర్శించుకున్నారు. సీపీకి పూర్ణ కుంభంతోఅర్చకులు, ఉత్సవ సమితి సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద సీవీ ఆనంద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను డీసీపీగా ఉన్నప్పటి నుండి ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినాయక ఉత్సవాలను పూర్తి చేశామని గుర్తు చేశారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం గత ఏడాదిలాగే ఈసారి కూడా మధ్యాహ్నం లోపే పూర్తయ్యేలా చూస్తామన్నారు. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం చూసేందుకు లక్షలాది మంది వస్తారన్న సీపీ.. ఈ మేరకు ట్రాఫిక్‌ను సమన్వయం చేస్తూ బందోబస్తు పెంచుతామని తెలిపారు.
Also Read : అర్ధరాత్రి ఎల్లమ్మ గుడిలో చోరీ
నిమర్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామని.. ప్రశాంతంగా గణనాథుడి శోభాయాత్ర ముగిసేలా కట్టుదిట్టమైన భద్రతా ఉంటుందని స్పష్టం చేశారు. కాగా, గతంలో హైదరాబాద్ సీపీగా పని చేసిన సీవీ ఆనంద్‌ను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈసీ బదిలీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం సీవీ ఆనంద్‌ను ఏసీబీ డీజీగా నియమించింది. అయితే, ఈ నెల 7వ తేదీన (వినాయక చవితి) తిరిగి హైదరాబాద్ సీపీగా సీపీ ఆనంద్‌ను ప్రభుత్వం అపాయింట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఖైరతాబాద్ బడా గణపతి శోభాయాత్రకు బందోబస్తు ఏర్పాట్లపై సీవీ ఆనంద్ దృష్టి పెట్టారు.