అందరూ కోర్టు ఆదేశాలు ఫాలో అవ్వాల్సిందే: సీపీ శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: వచ్చే నెల (సెప్టెంబర్) 7వ తేదీ నుండి దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభంకానున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‎తో పాటు రాష్ట్రవ్యాప్తంగాపెద్ద ఎత్తున గణేష్ ఉత్సవాలు జరగనున్నాయి. ఇప్పటికే విగ్రహాల తయారీ పూర్తై అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు వినాయక మండపాల ఏర్పాటు సైతం స్టార్ట్ అయ్యింది.  వినాయక చవితికి మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంటడంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. 

ఈ మీటింగ్‎కు సంబంధిత అధికారులతో పాటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ శ్రీనివాస్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. నిర్ధిష్ట  ప్రదేశాల్లోనే గణేషుడి మండపాలు ఏర్పాటు చేయాలని, స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగుండా చూడాలని నిర్వహకులకు సూచించారు. మండపం ఏర్పాటుతో పాటు నిమజ్జనం వేళ కోర్టు ఆదేశాలు పాటించాలని చెప్పారు. మండపాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. 

Also Read :- నల్లనయ్య.. గోకులంలో గోపాలుడు

నిమజ్జనానికి తగిన సంఖ్యలో క్రేన్లు ఏర్పాటు చేయాలని, రోడ్ల మరమ్మతు పనులు, లైట్ల ఏర్పాటు, విద్యుదాఘాత నివారణ చర్యలు చేపట్టాలని.. భారీ వాహనాలు సులువుగా వెళ్లేందుకు చెట్లు కత్తిరించడం వంటి పనులు చేపట్టాలని సంబంధిత శాఖలకు సూచించారు. ఇంటిమేషన్ ఫారమ్‌లను సక్రమంగా పూరించాలని ఉత్సవ సమితిలకు ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పకడ్బందీ ప్రణాళికతో వినాయక ఉత్సవాలను నిర్వహించాలని అన్నారు.