హైదరాబాద్‌‌ షాన్‌‌ క్రికెటర్ అబిద్ అలీ.. గుర్తింపు దక్కని హీరో

హైదరాబాద్‌‌ షాన్‌‌ క్రికెటర్ అబిద్ అలీ.. గుర్తింపు దక్కని హీరో

హైదరాబాద్, వెలుగు: ఇండియా క్రికెట్‌‌లో ఒక గొప్ప శకం ముగిసింది. పాత తరం క్రికెటర్లలో దిగ్గజం, హైదరాబాద్ ఆణిముత్యం సయ్యద్ అబిద్ అలీ ఇకలేరు. దేశంలోనే అత్యుత్తమ ఆల్‌‌రౌండర్లలో ఒకడిగా వెలుగొందిన అబిద్‌‌ (83) వృద్దాప్య సమస్యలతో బుధవారం అమెరికాలోని కాలిఫోర్నియాలో కన్నుమూశారు. దేశ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న అబిద్ 1960–70ల్లో టీమిండియాను విజయపథంలో నడిపిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. 1971లో  పోర్ట్ ఆఫ్​స్పెయిన్‌‌లో వెస్టిండీస్‌‌పై, ది ఒవల్‌‌లో ఇంగ్లండ్‌‌పై చారిత్రక టెస్టు విజయాలు సాధించిన జట్టులో సభ్యుడైన అబిద్‌‌ తన కెరీర్‌‌‌‌లో 29 టెస్టులు ఆడి 47 వికెట్లు పడగొట్టి1,018 రన్స్ చేశారు. 

ఐదు వన్డేలు ఆడి 7 వికెట్లు, 93 రన్స్ ఖాతాలో వేసుకున్నారు. హైదరాబాద్‎కు చెందిన మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, ఎంఎల్‌‌ జైసింహా, అబ్బాస్ అలీ బేగ్ వంటి అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా వెలిగిన అబిద్‌‌  కొన్నేండ్లుగా కాలిఫోర్నియాలో ఉంటున్నారు. అబిద్ మృతి చెందినట్టు ఆయన బంధువు నార్తర్న్ కాలిఫోర్నియా క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన రెజా ఖాన్ తెలిపారు. అలీ మృతి పట్ల హెచ్‌సీఏ, పలువురు మాజీ క్రికెటర్ల సంతాపం వ్యక్తం చేశారు. అబిద్ నిర్భయమైన క్రికెటర్ అని.. జట్టు కోసం ఏం కావాలన్నా చేసేవారని సునీల్‌ గావస్కర్ చెప్పాడు. ఆంధ్ర క్రికెట్ టీమ్ కోచ్‌‌గా అబిద్ అలీ చేసిన కృషి మరువలేనిదని ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నాడు. 

తొలి టెస్టులోనే తడాఖా చూపెట్టి..

1941 సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో జన్మించిన అబిద్ అలీ బ్యాటర్‌‌‌‌, మీడియం పేసర్‌‌‌‌గానే కాకుండా అద్భుతమైన ఫీల్డర్‌‌‌‌గా పేరొందారు. 1967లో బ్రిస్బేన్‌‌లో ఆస్ట్రేలియాపై తొలి టెస్టులోనే ఆరు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించారు. అదే సిరీస్‌‌లో సిడ్నీలో జరిగిన టెస్టులో 78, 81 స్కోర్లతో అరంగేట్రంలోనే తన పేరు మార్మోగేలా చేసుకున్నారు. 1971లో అజిత్ వాడేకర్ కెప్టెన్సీలోని ఇండియా టీమ్  తొలిసారి వెస్టిండీస్‎లో టెస్ట్ సిరీస్ గెలిచిన సందర్భంలో అలీ కీలకపాత్ర పోషించారు. 

సునీల్ గావస్కర్ విన్నింగ్ రన్ కొట్టినప్పుడు తను నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌‌లో ఉన్నారు. అదే ఏడాది ఇంగ్లండ్‌పై ది ఓవల్‌లో అబిద్ విన్నింగ్ రన్ కొట్టడం విశేషం. ఏడేండ్ల టెస్టు కెరీర్‌‌‌‌లో ఇండియా తరఫున పలు మ్యాచ్‌‌ల్లో ఓపెనింగ్ బ్యాటర్‌‌‌‌గా, బౌలర్‌‌‌‌గా రావడం విశేషం. అలీ ఐదు వన్డేలే ఆడినప్పటికీ.. అవి చరిత్రలో నిలిచిపోయాయి. అజిత్ వాడేకర్‌‌‌‌ కెప్టెన్సీలో 1974లో హెడింగ్లేలో ఇంగ్లండ్‌‌తో ఇండియా ఆడిన తొట్ట తొలి వన్డేలో పాల్గొన్నారు. 1975 వన్డే వరల్డ్ కప్‌‌లోనూ మూడు వన్డేల్లో పోటీపడ్డారు.

హైదరాబాద్‌‌ షాన్‌‌

టీమిండియాలోకి వచ్చే ముందు, ఆ తర్వాత అబిద్ అలీ దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్ తరఫున అద్భుత పెర్ఫామెన్స్ కనబరిచారు.   రంజీ ట్రోఫీలో ఒక దశాబ్దానికి పైగా హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. తన దూకుడైన బ్యాటింగ్, సూపర్‌‌‌‌ బౌలింగ్‎తో 1960–1970ల్లో జట్టును విజయవంతంగా నడిపించారు. దిగ్గజ క్రికెటర్ ఎంఎల్ జైసింహాను గురువుగా భావించే అబిద్ అలీ.. ఎల్బీ స్టేడియంలో ప్రాక్టీస్ చేసేవారు. జైసింహా సూచనతో బౌలింగ్‌‌ యాక్షన్‌‌ను మార్చుకోవడం తన కెరీర్‌‌‌‌ను మలుపు తిప్పిందని అబిద్ చెప్పేవారు. 

1959–60 సీజన్‌‌లో ఆంధ్ర జట్టుపై రంజీ అరంగేట్రం చేసిన అలీ తన కెరీర్‌‌‌‌ మొత్తంలో 212 ఫస్ట్‌‌ క్లాస్ మ్యాచ్‌‌లు ఆడి 397 వికెట్లు పడగొట్టారు. 8,752 రన్స్ తీశారు. ఇందులో 13 సెంచరీలు, 41 ఫిఫ్టీలు ఉన్నాయి. .ఇండియా, హైదరాబాద్ క్రికెట్‌‌లో అబిద్‌‌ను ముద్దుగా ‘చిచ్చా’ అని పిలిచేవారు. ఆటకు వీడ్కోలు చెప్పిన తర్వాత, కోచ్‌గా విశేష సేవలు అందించారు. అమెరికా, మాల్దీవ్స్‌‌, యూఏఈలో యువ క్రికెటర్లను మెరుగుపరిచారు. ఆంధ్ర రంజీ జట్టుకు కూడా కోచింగ్ ఇచ్చారు. 

గుర్తింపు దక్కని హీరో

ఆటగాడిగా, కోచ్‌‌గా ఎంతో పేరు గడించినప్పటికీ అబిద్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  బీసీసీఐ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌‌ (హెచ్‌‌సీఏ) తనను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒక దశలో జీవనోపాధి కోసం అమెరికాకు వెళ్లాల్సి వచ్చింది. భార్య సయీదా అక్కడ ఉద్యోగం చేయగా పదేండ్ల పాటు అబిద్ అమెరికాలోనే ఉన్నారు. ఆరోగ్య పరంగా కూడా ఆయన పలు సమస్యలు ఎదుర్కొన్నారు. బై పాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత అబిద్ చనిపోయారని మాజీ క్రికెటర్‌‌ ఫరూఖ్ ఇంజనీర్‌‌ పొరపాటుగా ప్రకటించారు. ఆ వార్త చదువుకొని అబిద్ నవ్వుకున్నారు. 

తన కొడుకును ఇండియా మాజీ క్రికెటర్ సయ్యద్ కిర్మాణి కూతురుకు ఇచ్చిపెండ్లి చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇండియాకు వచ్చి కోచింగ్‌‌ ఇచ్చారు. ఆంధ్ర నుంచి వేణుగోపాల్‌రావు టీమిండియాకు ఆడటంలో అబిద్ అలీ కృషి చాలా ఉంది. ప్రస్తుత తరం క్రికెటర్లలో విరాట్ కోహ్లీని అబిద్ ఎంతో ఇష్టపడేవారు. కోహ్లీ బ్యాటింగ్‌‌, కెప్టెన్సీ తన దూకుడు ముఖ్యంగా ఆస్ట్రేలియా క్రికెటర్లను ఢీకొనే  విధానం అబిద్‌‌ను ఆకర్షించింది. మొత్తంగా ఆటగాడిగా, కోచ్‌‌గా దేశ క్రికెట్‌‌కు ఎనలేని సేవలు అందించినప్పటికీ అబిద్‌‌ పెద్దగా గుర్తింపు దక్కని హీరోగా 
 మిగిలిపోవడం శోచనీయం.