- రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పరిధిలో రిటైర్డ్ జవాన్ దారుణం
- మాంసం ముద్దలను కుక్కర్లో ఉడికించి డ్రైనేజీల్లో పడేసిండు
- బొక్కలను కాల్చి పొడి చేసి చెరువులో కలిపిండు
- సాక్ష్యాధారాలు దొరకకుండా పక్కాగా మర్డర్
- పోలీసుల ఎదుట నేరం ఒప్పుకున్న నిందితుడు?
- నిరూపించడమెలా అని తలలు పట్టుకుంటున్న పోలీసులు
బడంగ్ పేట/ఎల్బీనగర్, వెలుగు : రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పరిధిలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను చంపి ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో వేసి ఉడికించాడు. తర్వాత వాటిని తీసుకువెళ్లి సమీపంలోని డ్రైనేజీలో పడేశాడు. బొక్కలను కాల్చి పొడి చేసి చెరువులో కలిపాడు. ఈ నెల16న ఘటన జరగ్గా.. బుధవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..ప్రకాశం జిల్లాకు చెందిన ఉప్పల సుబ్బమ్మ, వెంకటరమణ భార్యాభర్తలు. వీరికి ముగ్గురు బిడ్డలు. పెద్ద కుమార్తె వెంకటమాధవి(35)ని13 ఏండ్ల కింద అదే జిల్లాకు చెందిన గురుమూర్తికి ఇచ్చి పెండ్లి జరిపించారు.
వీరికి ఇద్దరు పిల్లలు. గురుమూర్తి ఆర్మీలో జవాన్‌గా పని చేసి వాలంటరీ రిటైర్మెంట్తీసుకున్నాడు. తర్వాత కంచన్‌బాగ్ డీఆర్డీవోలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ మీర్ పేట్ పీఎస్పరిధి జిల్లెలగూడలోని న్యూ వెంకటేశ్వర కాలనీలో ఉంటున్నాడు. కొన్నాళ్ల నుంచి గురుమూర్తి తన భార్య వెంకటమాధవిపై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంలో భార్యాభర్తలకు తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.
ఈ క్రమంలో ఈ నెల16వ తేదీన భార్యతో గొడవపడిన గురుమూర్తి.. తర్వాత తన భార్య కనిపించడం లేదని అత్తమామలకు సమాచారం ఇచ్చాడు. తనతో గొడవ పడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఒక్కడే వెళ్లి మీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా..
దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇంటి ఎదురుగా, పక్కన ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో 16వ తేదీన గాని, ఆ తర్వాత గాని..వెంకటమాధవి ఎక్కడా బయటకు వెళ్లినట్టుగాని, లోపలకు వచ్చినట్టు గాని కనిపించలేదు. పలుమార్లు గురుమూర్తి కొన్ని కవర్లతో బయటకు వెళ్లి రావడాన్ని గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించినట్టు సమాచారం. తర్వాత వెంకటమాధవి అత్తతో ఫిర్యాదు తీసుకుని సీసీటీవీ ఫుటేజీల గురించి గురుమూర్తికి చెప్పి ప్రశ్నించారు. ఇక కేసు నుంచి బయటపడలేనని అర్థమైన గురుమూర్తి..తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.
ఎముకల నుంచి మాంసం వేరు చేసి..
ఈ నెల16న పిల్లలకు సెలవులు ఉండడంతో ఇంట్లో లేరు. ఆ రోజు కూడా గురుమూర్తి, వెంకట మాధవి గొడవపడ్డారు. దీంతో ఆవేశంలో ఉన్న గురుమూర్తి ఆమెను హత్య చేశాడు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని భయపడి సాక్ష్యాలు లేకుండా చేయాలనుకున్నాడు. ముందుగా భార్య డెడ్‌బాడీని మటన్కొట్టే కత్తితో ముక్కలు ముక్కలుగా నరికాడు. ఎముకల నుంచి మాంసాన్ని వేరు చేశాడు.
మొత్తం మాంసాన్ని ఇంట్లో ఉన్న కుక్కర్లో దఫదఫాలుగా వేసి ఉడికించి పీస్పీస్చేశాడు. తర్వాత ఎముకలను కాల్చివేశాడు. తర్వాత పొడిగా చేశాడు. వీటన్నింటిని కవర్లలో వేసుకొని ఒకే చోట వేస్తే దొరికిపోతానని డ్రైనేజీల్లో, మీర్‌పేట చందచెరువులో కలిపాడు. భార్యను చంపడానికి ముందు గురుమూర్తి ప్రాక్టీస్కోసం కుక్కను చంపాడని తెలుస్తోంది.
తలలు పట్టుకుంటున్న పోలీసులు
గురుమూర్తి నేరం ఒప్పుకున్నా నిరూపించలేని స్థితిలో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. గురుమూర్తే నేరస్తుడు అని చెప్పడానికి వారి దగ్గర ఒక్క ఆధారం కూడా లేదు. పోలీసులు ముందు వెంకటమాధవి చనిపోయిందని నిరూపించాల్సి ఉంటుంది. అలా చేసినా ఆమెను భర్తే హత్య చేశాడని ప్రూవ్చేయాలి. ఆమె ఎముకలను పొడి చేసి చెరువులో కలపడం, మాంసాన్ని పీస్‌లు చేసి డ్రైనేజీల్లో వేయడంతో ఇప్పుడు వాటి ఆనవాళ్లు కూడా లేవు.
ఇంట్లోనే ఆమె శరీరానికి సంబంధించిన మాంసపు ముద్ద ఏదైనా దొరికితే దాని ఆధారంగా డీఎన్ఏ టెస్ట్‌చేసి చనిపోయింది వెంకటమాధవే అని తేల్చే అవకాశం ఉంటుంది. కానీ, ఇదంతా పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.