![హైదరాబాద్లో భారీ లాభాల పేరిట పెట్టుబడి పెట్టించి రూ.43 లక్షలు కొట్టేశారు..](https://static.v6velugu.com/uploads/2025/02/hyderabad-cyber-cell-recovers-43-lakhs-from-online-fraudsters_NjO4fV6dKA.jpg)
బషీర్బాగ్, వెలుగు: భారీ లాభాల పేరిట పెట్టుబడి పెట్టించి రూ.43 లక్షలు కొట్టేసిన సైబర్ చీటర్ ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తొలుత సిటీకి చెందిన 55 ఏండ్ల ప్రైవేటు ఉద్యోగికి ఫేస్ బుక్ ద్వారా గోల్డ్ మాన్ సచ్స్ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో పార్ట్ టైం జాబ్ అంటూ ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. మొదట టాస్క్ లకు లాభాలు ఇచ్చి , నమ్మకం కలిగించాడు. ఆ తర్వాత పెట్టుబడి పెడితే పెద్దమొత్తంలో లాభాలు వస్తాయని నమ్మబలికాడు.
వారి మాటలు నమ్మిన బాధితుడు పలు దఫాలుగా రూ 43,36,146 పెట్టుబడి పెట్టగా, మొత్తం కాజేశాడు. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బుధవారం ఏపీ సత్తెనపల్లికి చెందిన పగడల ఉమామహేశ్ (33) అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఇప్పటికే ఇండియా మొత్తంలో 8 కేసులో, తెలంగాణలో మూడు కేసులు ఉన్నట్లు గుర్తించారు. అతని నుంచి 4 ఫోన్లు , 4 ఏటీఎం కార్డులు , 4 చెక్ బుక్స్, ఒక పాస్ బుక్, షెల్ కంపెనీ స్టాప్ లను సీజ్ చేశారు.
మరో కేసులో..
ఇదే తరహాలో 41 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగిని మోసం చేసి, మొత్తం రూ 25,36,000 కాజేసిన హైదరాబాద్ కు చెందిన చెరుకు నవీన్ (33)ను అరెస్ట్ చేశారు. ఇండియా మొత్తం మీద 87 కేసులు , తెలంగాణలో 14 కేసులు ఇతనిపై నమోదైనట్లు సైబర్ క్రైమ్ డీసీపీ తెలిపారు.