స్టాక్ మార్కెట్​లో పెట్టుబడి పేరిట మోసం .. అహ్మదాబాద్​కు చెందిన నిందితుడి అరెస్ట్

స్టాక్ మార్కెట్​లో పెట్టుబడి పేరిట మోసం .. అహ్మదాబాద్​కు చెందిన నిందితుడి అరెస్ట్

బషీర్​బాగ్, వెలుగు:  స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పేరిట మోసం చేసిన వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.  నగరానికి చెందిన తండ్రీకూతురికి సైబర్​నేరగాళ్లు వేర్వేరుగా ఫోన్ చేశారు.  స్టాక్ మార్కెట్ లో బ్లాక్​ట్రేడింగ్​చేస్తే అధిక లాభాలు వస్తాయన్నారు. తాము మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులమని నమ్మించారు. దీంతో, వారు ఓ యాప్ ను డౌన్​లోడ్ చేసుకొని, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యారు. థర్డ్ పార్టీ అకౌంట్ లో మొత్తం రూ. 9.56 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. ఆ డబ్బులు రిటర్న్ చేయకుండా ఇంకా పెట్టుబడి పెట్టాలంటూ ఒత్తిడి చేయడంతో వారికి అనుమానం వచ్చింది. సదరు సెక్యూరిటీ సంస్థకు వెళ్లి, విచారించగా.. ఫేక్ యాప్ అని తేలింది. 

దీంతో బాధితులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. సైబర్ క్రైం ఇన్​స్పెక్టర్ మధుసూదన్, ఎస్ఐ వెంకటేశ్ దర్యాప్తు చేపట్టారు. గుజరాత్​లోని అహ్మదాబాద్ కు చెందిన వ్యాస్ రుత్విక్ స్మితల్ కుమార్ ను నిందితుడిగా గుర్తించి, సోమవారం అరెస్ట్​చేశారు.  ఇతనికి 2024లో డిజిటల్ అరెస్ట్ కేసులో ప్రమేయం ఉన్నట్లు, దేశవ్యాప్తంగా 80, మన రాష్ట్రంలో 11 కేసులున్నట్లు తేలింది. అతని వద్ద నుంచి ఫోన్ స్వాధీనం చేసుకొని, రిమాండ్ కు తరలించారు.

డిజిటల్ అరెస్ట్ కేసులో నిందితురాలు..

డిజిటల్ అరెస్ట్ పేరిట మోసగించిన కేసులో నిందితురాలిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన ఓ వ్యక్తికి గతేడాది సైబర్ నేరగాళ్లు ఫోన్​చేశారు. ముంబై బాంద్రాలోని కుర్లా పీఎస్ నుంచి మాట్లాడుతున్నట్లు తెలిపారు. మీ ఆధార్ కార్డు వివరాలతో ముంబై లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయిందని, దాని ద్వారా రూ.25 లక్షల అక్రమ లావాదేవీలు జరిగాయన్నారు.  మీరు డిజిటల్ అరెస్టయ్యారని చెప్పారు. ప్రస్తుతం మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు సక్రమంగా వచ్చినవో లేదో చెక్​చేస్తామని, తమకు పంపిస్తే 24 గంటల్లో తిరిగి అకౌంట్​లో వేస్తామని నమ్మబలికారు. దీంతో, అతను రూ.3.57 లక్షలు ట్రాన్స్​ఫర్​చేశాడు. 

తర్వాత వారు స్పందించకపోవడంతో మోసపోయినట్లు తెలుసుకొని, సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గుంటూరుకు చెందిన ఫిజియోథెరపిస్ట్​లు తోట శ్రీనివాసరావు, జీవన్ కుమార్, వ్యాపారి తమ్మిశెట్టి రఘువీర్ లను గత నెల 26న అరెస్ట్ చేశారు. ఇదే కేసులో A2 గా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి, హైదరాబాద్​లోని కొంపల్లి కి చెందిన కొత్తపల్లి రిత్వికను సోమవారం పట్టుకున్నారు. ఈమెపై దేశవ్యాప్తంగా 32 , మన రాష్ట్రంలో 3 కేసులు ఉన్నట్లు గుర్తించారు. 2 ఫోన్లు, వివిధ బ్యాంక్ లకు చెందిన 9 చెక్ బుక్స్, 3 పాస్ బుక్స్, 3 డెబిట్, 5 సిమ్ కార్డులు,  ఒక క్యూఆర్ కోడ్ స్కానర్, 2 స్టాంప్​లను స్వాధీనం చేసుకొని, రిత్వికను అరెస్ట్​చేశారు.