సైబర్ మోసాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. హై ప్రోఫైల్స్ పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్స్ క్రియేట్ చేసి, డబ్బులు అడగడం, ఇతరులను బెదిరించడం లాంటివి ఎక్కువైపోతున్నాయి. ఈ మధ్య కాలంలో చాలామందికి ఇలానే జరిగాయి. ఏకంగా యాంటి కరెప్షన్ బ్యూరో డీజీ పేరుతోనే ఓ సైబర్ నేరగాడు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ తెరిచి పలువురిని డబ్బులు అడుగుతున్నాడు. తెలంగాణ ఏసీబీ డీజీ CV ఆనంద్ పేరుతో ఓ వ్యక్తి నఖిలీ ఫేస్ బుక్, ఇస్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి ఫాలోవర్స్ ని డబ్బులు పంపమని అడుగుతున్నాడు.
రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి రాజస్థాన్ లో ఉన్న నేరస్తున్ని పట్టుకున్నారు. ఈ నేరానికి పాల్పడిన రాజస్తాన్ యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ యువకుడు ప్రముఖులు, ఐపిఎస్, ఐఏఎస్ అధికారులు, ఎంపి, ఏమ్యేల్యే ల పేరుపై నకిలీ ఖాతాలు తెరచి డబ్బులు కాజేయడమే పనిగా పెట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. ఇలాంటివి సామాన్య జనాలకు కూడా జరుతున్నాయి. నిజంగా వారే డబ్బు అడుగుతున్నారేమో అని అవతలి వ్యక్తులు వెంటనే పంపుతున్నారు.