శ్రీశైలంలో రూమ్ బుక్ చేస్తే.. రూ. లక్ష కాజేశారు .. సైబర్ ​నేరగాళ్ల చేతిలో మోసపోయిన నగర వాసి

శ్రీశైలంలో రూమ్ బుక్ చేస్తే.. రూ. లక్ష కాజేశారు .. సైబర్ ​నేరగాళ్ల చేతిలో మోసపోయిన నగర వాసి
బషీర్​బాగ్, వెలుగు: శ్రీశైలంలో రూమ్ బుక్ చేస్తే.. సైబర్ నేరగాళ్లు రూ.లక్ష కాజేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి  వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి, ఆన్​లైన్​లో శ్రీశైలం దేవస్థానం వైశ్య సత్రంలో రూమ్ బుక్ చేశాడు. ఇందుకోసం రూ.1,000 చెల్లించాడు. కానీ, అదనంగా రూ.180 జీఎస్టీ చెల్లించాలని సైబర్​నేరగాళ్లు ఫోన్ చేశారు. అతడు ఆ డబ్బులు చెల్లించకపోవడంతో బుకింగ్ కన్ఫర్మ్ కాలేదు. దీంతో బాధితుడు తాను చెల్లించిన డబ్బులను రిఫండ్ చేయాలని, అదే  నంబర్ కు కాల్ చేసి, కోరాడు. అలా చేయాలంటే పేమెంట్ చేసిన నంబర్ నుంచి తమకు రూ.1 పంపించాలని సూచించడంతో పంపించాడు. వెంటనే స్కామర్స్ రూ.2 చెల్లించారు. 

మొత్తం డబ్బులు రిఫండ్ కావాలంటే రూమ్ రెంట్, జీఎస్టీ అమౌంట్ మొత్తం రూ.1,118 చెల్లించాలని చెప్పడంతో అలాగే చేశాడు. తర్వాత సర్వర్ సమస్యలున్నాయని, ఇప్పటివరకు పంపించిన మొత్తాన్ని పంపితే రెట్టింపు డబ్బులు ఇస్తామన్నారు. అతడు మళ్లీ పంపించాడు. చివరగా రూ.76,500 చెల్లించాలని డిమాండ్ చేయడంతో బాధితుడికి అనుమానం వచ్చి, వారితో గొడవ పడ్డాడు. తాను మోసపోయానని, రూ.1,33,564  పోగొట్టుకున్నట్లు ఆన్​లైన్​ద్వారా సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు.