సైబర్ చీటర్స్ కొట్టేసిన .. కోటి రికవరీ

సైబర్ చీటర్స్ కొట్టేసిన .. కోటి రికవరీ

బషీర్ బాగ్, వెలుగు: సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయిన బాధితులకు పోలీసులు అండగా నిలుస్తున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఓ కేసులో భారీ మొత్తాన్ని రికవరీ చేశారు. సిటీకి చెందిన 52 ఏళ్ల వ్యక్తి ఇటీవల సైబర్ చీటర్స్ చేతుల్లో మోసపోయాడు. తాము చెప్పిన ట్రేడింగ్ కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి, బాధితుడి నుంచి రూ.1.22 కోట్లను కాజేశారు. 

బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ డీసీపీ కవిత నేతృత్వంలో ఏసీపీలు శివమారుతి, చంద్ బాషా, సీఐ మధుసూదన్ రావు టీమ్ దర్యాప్తు చేపట్టారు. బ్యాంక్ అధికారులకు నోటీసులు జారీ చేసి, ట్రాన్స్​ఫర్​ చేసిన డబ్బులను ఫ్రీజ్ చేయాలని సూచించారు. అలాగే బాధితుడితో న్యాయస్థానంలో పిటిషన్ వేయించారు. కేసు వివరాలను పరిశీలించిన న్యాయస్థానం.. డబ్బు ట్రాన్స్​ఫర్​అయిన ఆయా బ్యాంక్ లకు మొత్తం రూ. 1.05 కోట్లను రిఫండ్ చేయాలని ఆదేశించింది.