గుంటూరు నుంచి డిజిటల్ అరెస్ట్..ఇద్దరు ఫిజియోథెరపిస్ట్ లు, వ్యాపారి బాగోతం బట్టబయలు

గుంటూరు నుంచి డిజిటల్ అరెస్ట్..ఇద్దరు ఫిజియోథెరపిస్ట్ లు, వ్యాపారి బాగోతం బట్టబయలు
  • రిమాండ్​కు తరలించిన సైబర్ క్రైమ్ పోలీసులు

బషీర్​బాగ్,వెలుగు: డిజిటల్ అరెస్ట్ పేరిట మోసగించిన ముగ్గురు ముఠా సభ్యులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన వీరబోయిన సాయి రాజ్ అనే వ్యక్తికి గతేడాది సైబర్ చీటర్స్ ఫోన్ కాల్ చేశారు. ముంబై బాంద్రాలోని కుర్లా పీఎస్ నుంచి కాల్ చేస్తున్నట్లు తెలిపారు.

అతని ఆధార్ కార్డు ఆధారంగా ముంబైలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయిందని, దాని నుంచి 25 లక్షల అక్రమ లావాదేవీలు జరిగాయన్నారు.ఈ కేసులో డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని, కేసు నుంచి బయటపడాలంటే అతని అకౌంట్ లో ఉన్న డబ్బులను తమకు పంపించాలని సూచించారు. 24 గంటల్లో విచారించి తిరిగి పంపిస్తామని నమ్మబలికారు. దీంతో బాధితుడు స్కామర్స్ అకౌంట్ కు మొత్తం రూ.3,57,998 లను బదిలీ చేశారు.

అనంతరం వారు స్పందించకపోవడంతో బాధితుడు గతంలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు గుంటూరుకు చెందిన ఫిజియోథెరపిస్ట్ లు తోట శ్రీనివాసరావు , జీవన్ కుమార్, వ్యాపారి తమ్మిశెట్టి రఘువీర్ ను అరెస్ట్ చేశారు. వీరిపై దేశంలో 14, తెలంగాణలో ఒక కేసు ఉన్నట్లు గుర్తించారు. వీరి నుంచి మూడు ఫోన్​లు, వివిధ బ్యాంక్ లకు చెందిన చెక్ బుక్స్, పాస్ బుక్స్, డెబిట్, క్రెడిట్ కార్డులను
 సీజ్ చేశారు.

పెట్టుబడి పేరిట మోసం.. ఒకరు అరెస్ట్

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ మోసగించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన ఓ బాధితుడి నెంబర్ ను వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసి , స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయంటూ ఫేక్ స్క్రీన్ షాట్స్ ను స్కామర్ షేర్ చేశాడు. అది చూసి నిజమని నమ్మిన బాధితుడు గతేడాది మొదట చిన్న మొత్తం లో ఇన్వెస్ట్ చేయగా, లాభాలు వచ్చాయి.

ఆపై పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే 10 రేట్లు లాభాలు వస్తాయని స్కామర్ చెప్పడంతో బాధితుడు మొత్తం రూ 6,20,000 లను ఇన్వెస్ట్ చేశాడు. అనంతరం స్కామర్ స్పందించకపోవడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి , దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు గుజరాత్ కు చెందిమ లలిత్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై దేశంలో 13 , తెలంగాణలో రెండు కేసులో నమోదు అయినట్లు గుర్తించారు.

రూ.9.50 లక్షలు రీఫండ్

సైబర్ నేరగాళ్ల చేతిలో బాధితుడు పోగొట్టుకున్న మొత్తం డబ్బును పోలీసులు రీఫండ్ చేశారు. నగరానికి చెందిన 32 ఏళ్ల వ్యాపారి తనను బిజినెస్ పేరిట స్కామర్లు మోసం చేశారని గతేడాది సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తంరూ 9,50,531 లను మోసపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ ఇన్​స్పెక్టర్ కె.ప్రసాద రావు, ఎస్ఐ అభిషేక్ మరియ తన టీమ్ సభ్యులతో దర్యాప్తు చేపట్టారు. స్కామర్ న్యూఢిల్లీ లోని ద్వారక సెక్టార్ 7 లో ఉన్నట్లు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని నిందితుడి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా బాధితుడు పోగొట్టుకున్న మొత్తం నగదు రూ.9,50,531 లను బాధితుడికి అందజేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.