
హైదరాబాద్: మ్యాట్రిమొనీ వెబ్‌సైట్ షాదీ డాట్‌కామ్‌పై పోలీసులు కేసు చేశారు. వెబ్‌సైట్కు సంబంధించి డైరెక్టర్ మేనేజర్‌తో పాటు టీమ్ లీడర్లపై కేసులు నమోదు చేశారు. ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా అమ్మాయిల ప్రొఫైల్స్ షేర్ చేయడంపై కేసు నమోదైంది. యానాం ఎమ్మెల్యే ప్రొఫైల్ పెట్టి మోసాలకు పాల్పడ్డ వంశీకృష్ణ కేసులో పోలీసులు సదరు వెబ్సైట్పై చర్యలు తీసుకున్నారు. షాదీ డాట్‌కామ్ వంశీకృష్ణకు 20 మంది అమ్మాయిల ప్రొఫైల్స్ షేర్ చేసింది.
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉండే వంశీకృష్ణ తనను తాను ధనవంతుడిగా మ్యాట్రిమొనీ సైట్స్లో పరిచయం చేసుకుంటాడు. నెత్తి మీద సరిగ్గా జుట్టే లేకపోయినప్పటికీ విగ్గులు పెట్టుకుని, లుక్ మార్చుతూ ఫొటోలు అప్లోడ్ చేస్తాడు. మ్యాట్రిమొనీలో వరుడి కోసం వెతుకుతున్న అమ్మాయిలకు, అమ్మాయి తల్లిదండ్రులకు అందగాడు, డబ్బునోడు అనే ఫీల్ క్రియేట్ చేస్తాడు.
మ్యాట్రిమొనీ వెబ్‌సైట్ షాదీ డాట్‌కామ్‌లో అందమైన ఫొటోలు పెట్టి ‘కోట్ల ఆస్తి ఉన్న తనకు వధువు కావలెను’ అని వంశీకృష్ణ ప్రొఫైల్ అప్ లోడ్ చేస్తాడు. నమ్మి అతని వలలో పడిన అమ్మాయిలను పెళ్లి చేసుకుని, లక్షల కట్నం దండుకుని కొన్నాళ్లకు ముఖం చాటేస్తాడు. మరో గెటప్తో మళ్లీ ప్రొఫైల్ అప్ లోడ్ చేస్తాడు. ఆ వచ్చిన డబ్బులతో రాయల్ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. సింపుల్గా చెప్పాలంటే.. వంశీకృష్ణ దందా ఇది.
ఇలా విగ్‌లు పెట్టుకుని, వేషాలు మారుస్తూ మోసాలకు పాల్పడుతున్న వంశీకృష్ణ దాదాపు 50 మంది అమ్మాయిలను పెళ్లి చేసుకుని మోసం చేశాడు. ఒక లేడీ డాక్టర్ను కూడా ఇలానే పెళ్లి చేసుకుని మోసం చేయగా.. ఇతని మోసాన్ని గ్రహించిన ఆ డాక్టర్ తండ్రి ధైర్యం చేసి సైబర్ క్రైం పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో 2024 డిసెంబర్లో ఇతగాడి బాగోతం వెలుగులోకి వచ్చింది.