డిజిటల్ అరెస్ట్తో రూ. 34 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు అరెస్ట్

డిజిటల్ అరెస్ట్ మోసం కేసులో గుజరాత్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ వ్యక్తి నుంచి రూ. 34 లక్షలు కాజేసినట్లు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన  వారు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన బరియా సంజీవ్ కుమార్ బాబుభాయ్ ,  కాలీ రోహిత్ కుమార్.

నిందితులు  కొరియర్, టెలికాం డిపార్ట్‌మెంట్, ట్రాయ్, సీబీఐ, సైబర్ క్రైమ్ పోలీస్, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధులుగా చలామణి అవుతూ వాట్సాప్ కాల్స్, స్కైప్ కాల్స్, ఇంటర్నెట్ కాల్స్ ద్వారా బాధితులను సంప్రదిస్తున్నారు.  మనీలాండరింగ్ కేసులు, తీవ్రవాద కార్యకలాపాలు, తీవ్రమైన నేరాలలో ప్రమేయం ఉన్నారని ఫేక్   కోర్టు ఆర్డర్ కాపీలను ఫార్వార్డ్ చేసి డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరిస్తున్నారు.  డబ్బులు పంపిస్తే కేసులు కొట్టివేస్తామని చెబుతూ..డబ్బులు వచ్చాక  వారి నంబర్లను బ్లాక్ చేస్తున్నారు. ఇలా ఓ బాధితుడి నుంచి రూ. 34 లక్షలు తీసుకున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిసిపి డి కవిత  తెలిపారు.