- కాంగ్రెస్లో చేరుతున్నట్టు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, ఆమె భర్త, బీఆర్ఎస్ కార్మిక విభాగం నేత మోతే శోభన్ రెడ్డి మంగళవారం జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కలిశారు. త్వరలో బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్లో చేరనున్నట్లు వారు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి తాము కేసీఆర్ వెంటే ఉన్నామని తెలిపారు. అయితే.. కేసీఆర్, కేటీఆర్ తమను పట్టించుకోవడంలేదన్నారు. అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వడం లేదని వివరించారు.
ఇటీవల కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం మూడు గంటలు వెయిట్ చేసినా.. కలవలేదని శోభన్ రెడ్డి ఆరోపించారు. పార్టీ కోసం ఎన్నో ఏండ్లు పని చేసిన తమను పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇక వారితో కలిసి పని చేయడం కష్టమని భావించినట్టు వివరించారు. కాంగ్రెస్లో చేరేందుకు నిర్ణయించామని, త్వరలో తేదీ ప్రకటిస్తామని వెల్లడించారు. అయితే, వీరు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తున్నది.