- ‘డయల్ 100, 108, 101’ స్థానంలో అందుబాటులోకి
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా ఆపరేషన్స్
- త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ
- ఏర్పాట్లు పూర్తి చేసిన సిటీ పోలీసులు
హైదరాబాద్,వెలుగు: ‘డయల్ 100, 108, 101’.. రానున్న రోజుల్లో కనుమరుగు కాబోతున్నాయి. వాటి స్థానంలో రాష్ట్రవ్యాప్తంగా ‘డయల్112’ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఇకపై ఒకే నంబర్ వినియోగంలోకి రానున్నది. టీజీ పేరుతో ప్రత్యేక లోగోను కూడా అధికారులు సిద్ధం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా త్వరలోనే ‘డయల్ 112’ సేవలను అందుబాటులోకి తేనున్నారు. ఇందుకు సంబంధించి సిటీ పోలీసులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా ఈ సర్వీసెస్ ఆపరేట్ చేయనున్నారు. దీంతో పోలీస్ (100), అంబులెన్స్(108), ఫైర్(101), చైల్డ్ వెల్ఫేర్, విమెన్ సేఫ్టీ సహా అత్యవసర పరిస్థితుల్లో సత్వర సేవలు అందనున్నాయి.
ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైమ్ తగ్గించేలా..
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నెంబర్ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 112 నంబర్‌ను గతంలోనే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని డయల్ 100కి వచ్చిన కాల్స్ 112 ద్వారా ఆయా డిపార్ట్‌మెంట్స్‌కు చేరుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ‘డయల్ 100’ స్థానంలో దీనిని తీసుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా డయల్ 100కు ఫోన్ చేస్తే..5 నుంచి 8 నిమిషాల వ్యవధిలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం, స్థానిక పోలీసులు ఘటన స్థలాలకు చేరుకుంటున్నారు. ఐతే కాల్స్ రూటింగ్‌లో కొంత సమయం ఆలస్యం అవుతుండడంతో సమస్యను పరిష్కరించేందుకే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెస్పాన్స్ సమయం తగ్గించేందుకు డైరెక్ట్‌గా 112 కు కాల్స్ వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసింది.
అవగాహన వచ్చేంత వరకు ‘డయల్ 100’
‘డయల్ 112’పై ప్రజల్లో అవగాహన వచ్చేంత వరకు ‘డయల్ 100’ అందుబాటులో ఉంటుందని పోలీసు శాఖ వెల్లడించింది. అప్పటికి వరకు 112తో పాటు డయల్ 100కి వచ్చే ఫోన్ కాల్స్ ఆటోమేటిక్‌గా 112కి ట్రాన్స్‌ఫర్ అవుతుంటాయి. సోషల్ మీడియా, పోలీస్ స్టేషన్స్, సిటీలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్ ద్వారా ప్రచారం చేయనున్నారు. సామాన్యులకు అవగాహన కలిగేందుకు పోలీస్ వాహనాలు,ఫైర్ సర్వీసెస్ సహా ఎమర్జెన్సీ సర్విసులు అందించే డిపార్ట్‌మెంట్స్ వెహికల్స్‌పై ‘డయల్112’ స్టిక్కర్లను అంటించనున్నారు.