గోల్కొండ ప్రభుత్వాస్పత్రిని అప్​గ్రేడ్​చేద్దాం

గోల్కొండ ప్రభుత్వాస్పత్రిని అప్​గ్రేడ్​చేద్దాం
  • ప్రతిపాదనలు రెడీ చేయాలని హైదరాబాద్ ​కలెక్టర్​ ఆదేశం

మెహిదీపట్నం, వెలుగు : గోల్కొండ ఏరియా హాస్పిటల్ ను 200 బెడ్ల హాస్పిటల్​గా అప్ గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు రెడీ చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి డీసీహెచ్ఎస్ ను ఆదేశించారు. శుక్రవారం ఆయన గోల్కొండ ఆసుపత్రిని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ తో కలిసి తనిఖీ చేశారు. అక్కడి ఐసీయూ, డయాలసిస్ సెంటర్, ఫార్మసీ స్టోర్, ఇన్​పేషెంట్, ఔట్ పేషెంట్ వార్డులను పరిశీలించారు.

పేషెంట్లతో మాట్లాడి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అందరూ పాజిటివ్​గా రెస్పాండ్​అవడంతో డాక్టర్లు, సిబ్బంది కలెక్టర్​అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. అనంతరం గోల్కొండ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలను ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్ సందర్శించారు. స్కూళ్లు మొదలై 15 రోజులవుతున్నా..

ఇంకా పూర్తిస్థాయిలో పిల్లలు రాకపోవంపై అసహనం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులతో మాట్లాడి 100 శాతం హాజరు ఉండేలా చూడాలన్నారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ సునీత, గోల్కొండ ఆస్పత్రి సూపరింటెండెంట్ మహమ్మద్ మజారుద్దీన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.